బైక్‌ చోరీ కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ చోరీ కేసులో నిందితుడి అరెస్టు

Published Sat, Jan 18 2025 12:12 AM | Last Updated on Sat, Jan 18 2025 12:12 AM

బైక్‌ చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బైక్‌ చోరీ కేసులో నిందితుడి అరెస్టు

జగిత్యాల క్రైం: బైక్‌ చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన గుర్రం శరత్‌కుమార్‌ బైక్‌ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం స్థానిక చిన్న కెనాల్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో జగిత్యాల చిలుకవాడలో ఉంటున్న కోరుట్ల గంగంపేటకు చెందిన ఎండీ.అమీర్‌ నంబర్‌ ప్లేట్‌ లేని వాహనంపై వచ్చాడు. అతని వద్ద ఎటువంటి వాహన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2024 అక్టోబర్‌ 20న జగిత్యాల కొత్త బస్టాండ్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే దారిలో ఒక బైక్‌, 2024 డిసెంబర్‌ 18న అశోక్‌నగర్‌లోని ఓ ఆస్పత్రి ఎదుట మరో బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు మొత్తం మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్‌, ఎస్సైలు మన్మదరావు, గీత, కానిస్టేబుళ్లు జీవన్‌, అనిల్‌ పాల్గొన్నారు.

డబ్బులు, ఫోన్‌ లాక్కెళ్లిన ఇద్దరి రిమాండ్‌

ఓ వ్యక్తిని బెదిరించి, డబ్బులు, ఫోన్‌ లాక్కెళ్లిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన దుర్గం సాయిబాబా కొంతకాలంగా జగిత్యాల బైపాస్‌ రోడ్‌లోని గోవిందుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న పని నిమిత్తం బయటకు వెళ్లి, తిరిగి వస్తున్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో గోవిందుపల్లి వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి, అతన్ని అడ్డగించారు. చంపుతామని బెదిరించి, రూ.2,800, సెల్‌ఫోన్‌ లాక్కొని, పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు జగిత్యాల పురాణిపేటకు చెందిన పోచంపల్లి శంకర్‌, జగిత్యాల రూరల్‌ మండలం బాలపల్లికి చెందిన సిరికొండ నరేశ్‌లుగా గుర్తించారు. శుక్రవారం జగిత్యాల మంచినీళ్ల బావి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరూ పట్టుబడ్డారని డీఎస్పీ పేర్కొన్నారు. నగదు, ఫోన్‌, బైక్‌ స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసిన పట్టణ పోలీసులను ఎస్పీ అశోక్‌కుమార్‌ అభినందించారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్‌, ఎస్సైలు మన్మదరావు, గీత పాల్గొన్నారు.

మూడు వాహనాలు స్వాధీనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement