అంధకారంలో సిరిసిల్ల బల్దియా
● బిల్లు చెల్లించలేదని పవర్ కట్
● సెస్ అధికారుల చర్యతో షాక్
● రాత్రి పునరుద్ధరణ
సిరిసిల్లటౌన్: కరెంటు బిల్లులు చెల్లించలేదంటూ సిరిసిల్ల సెస్ అధికారులు బల్దియాకు షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్ సర్వీసులు తొలగించారు. మున్సిపాలిటీ రూ.4.60 కోట్ల విద్యుత్ బిల్లులు సెస్‌కు బకాయి పడింది. చెల్లించాలని డిసెంబర్ నుంచి రెండు పర్యాయాలు నోటీసులు అందించారు. బిల్లుల చెల్లింపులో స్పందన లేకపోవడంతో శుక్రవారం సెస్ ఎండీ విజయేందర్‌రెడ్డి ఆదేశాలతో సిబ్బంది బల్దియాకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అధికారులు చీకట్లోనే సేవలందించారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని సెస్ అధికారులతో మున్సిపల్ అధికారులు మాట్లాడగా..రాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు కమిషనర్ లావణ్య తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
● ఘటనకు కారణమైన వ్యక్తిపై కేసు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ బైక్ మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మికుంట టౌన్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన మైస అభిషేక్ శుక్రవారం బైక్‌ను అజాగ్రత్తగా నడుపుతూ.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఈదునూరి కుమారస్వామి, సుమలత, ముక్కెర సుగుణమ్మ, రాజకొమురయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు సుగుణమ్మ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన అభిషేక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
స్తంభాన్ని ఢీకొన్న కారు : ఆర్‌ఎంపీ దుర్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్‌ఎంపీ మృతిచెందినట్లు కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంటకు చెందిన ఓరుగంటి రామచంద్రం(63) కొన్నేళ్లుగా కొత్తపల్లి మండలంలోని బావుపేటలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బావుపేట నుంచి కారులో కరీంనగర్ వెళ్తున్నాడు. చింతకుంట శివారులో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుబోయి కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి, కారుపై పడటంతో రామచంద్రం తలకు బలమైన గాయాలై, మృతిచెందాడు. మృతుడి కుమారుడు డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment