ఫోర్జరీ
● కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని నాలా మ్యాన్ నిర్వహణ, లాగ్ బుక్ ఎంట్రీల్లో అక్రమాలు ● సిల్ట్ తీసేందుకు టెండర్లు, అవే పనుల్లో నాలా మ్యాన్ వెహికిల్ ● సమాచార హక్కు చట్టంతో వెలుగు చూసిన కొత్త అవినీతి
జవాన్ల
సంతకాలు
బల్దియాలో మరో కుంభకోణం!
అసలేం జరిగింది?
కరీంనగర్‌లోని వివిధ డివిజన్లలోని పెద్ద మోరీల్లో పేరుకుపోయిన సిల్ట్ (వ్యర్థాలు) తొలగించేందుకు బల్దియా నాలా మ్యాన్ పేరిట వాహనాన్ని సమకూర్చుకుంది. ఈ వాహనం మీద ఒక డ్రైవర్, ఆపరేటర్‌ను నియమించింది. నాలా మ్యాన్ వెహికిల్ ముందుభాగాన్ని రిజిస్ట్రేషన్ (టీఎస్ 02 యూసీ 7379) చేసిన అధికారులు, దాని వెనక ట్రాలీని మాత్రం రిజిస్ట్రేషన్ చేయకుండా.. వదిలేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. నగరంలో పలు డివిజన్లలోని పెద్ద మోరీల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను సమయానుసారంగా ఈ నాలా మ్యాన్ వెహికిల్ తొలగించి, దాన్ని డంప్ యార్డు వద్ద బరుతు తూచి డంప్ చేయాలి. దీనికి తరువాత లాగ్ బుక్కులో తేదీ, డివిజన్ వివరాలు, జవాన్ల సంతకాలతోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ సూపర్ వైజర్‌ల సంతకాలు తీసుకోవాలి. కానీ... క్షేత్రస్థాయిలో కేవలం జవాను సంతకం లాగుబుక్కుల్లో పనులు చేస్తున్నట్లుగా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే, వీరి పనితీరుపై పలువిమర్శలు రావడంతో ఈ పని వివరాలు నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు ద్వారా సేకరించడంతో ఇందులో జరుగుతున్న కుంభకోణం వెలుగుచూసింది.
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న సామెత కరీంనగర్ బల్దియాకు చక్కగా సరిపోతుంది. నాలాల్లో సిల్ట్ తీసేందుకు వాడే నాలా మ్యాన్ వెహికిల్ పని విషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అసలు వాహనం బయటికి రాకున్నా.. డివిజన్లలో మోరీల్లో నాలామ్యాన్ వెహికిల్ తిరగకున్నా.. ఏకంగా పని జరిగినట్లు లాగ్ బుక్కుల్లో వివరాలు నమోదు చేసుకుని, జవాన్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మరీ డీజిల్ పేరిట నిధులు దిగమింగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. గతంలో చనిపోయిన వారికి ఇంటినెంబర్లు కేటాయించి, బతికి ఉన్న వారికి డెత్ సర్టిఫికెట్ జారీచేసిన బల్దియా తాజాగా మరోసారి తన చేతివాటాన్ని చాటుకుంది. బల్దియాలో మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న నగరపౌరుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.
ఎలా చేస్తున్నారు?
నాలా మ్యాన్ వెహికిల్ డివిజన్లలో తిరగకున్నా.. తిరిగినట్లు.. ఆ పనిని జవాన్లు సంతకం చేసి ధ్రువీకరించినట్లు రికార్డులు రాసుకుంటూ వాహన డ్రైవర్, ఆపరేటర్ డీజిల్, వెహికిల్ మెయింటెనెన్స్ కింద ఖజానాకు గండి కొడుతున్నారు. ఇందుకోసం జవా న్ల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. ఉదాహరణకు 37వ సంజీవ్, నాలుగో డివిజన్ వాజీద్, 24 డివిజన్ అరవింద్, 2వ డివిజన్ సతీశ్, 1వ డివిజన్ కుమార్ తదితరుల సంతకాలు నాలా లాగ్‌బుక్‌లో ఒక విధంగా, ఫాగింగ్ మిషన్ లాగ్ బుక్కులో మరోలా ఉండటం గమనార్హం. ఈ లెక్కన నాలా మ్యాన్ లాగ్‌బుక్కులో సంతకాలు ఫోర్జరీ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విచిత్రంగా ఇవే వీరు రికార్డు చేసుకున్న మోరీల్లో దాదాపు అన్నీ మోరీల్లో సిల్ట్ తీసేందుకు గతేడాది వర్షాకాలానికి ముందే ఇంజినీరింగ్ విభాగం కూడా టెండర్లు పిలిచింది. కొన్ని మోరీల్లో సిల్ట్ ను నాలా మ్యాన్ వెహికిల్ ద్వారా తొలగించే వీలున్నపటికీ.. ఇంజినీరింగ్ విభాగం అన్ని మోరీలకు టెండర్లు పిలవడం వెనక ఆంతర్యం ఏంటి అన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఇంజినీరింగ్ విభాగం పనిచేసిన మోరీల్లో నాలా మ్యాన్ వెహికిల్ తిరిగి సిల్ట్ తీయడం, దాని కోసం నిధులు ఖర్చు చేయడం వెనక మతలబు ఏంటో బల్దియా పెద్దలకే తెలియాలి.
దృష్టికి రాలేదు
నాలా మ్యాన్ వాహనాలలో జవాన్ల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారన్న విషయం దృష్టికి రాలేదు. వస్తే.. వాటిని చూసి పరిశీలించి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాను.
– స్వామి, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment