చామరాజపేటె భవన బెంగళూరు ప్రెస్ స్కూల్ ఆవరణలో విద్యార్థులు
బనశంకరి: ఉదయం పిల్లలను పాఠశాలలకు పంపిన తల్లిదండ్రులు తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అంతలోనే పిడుగులాంటి వార్త వారి చెవిన పడింది. గుర్తు తెలియని వ్యక్తులు 60 స్కూళ్లలో బాంబు పెట్టినట్లు ఉదయం 9గంటల సమయంలో వార్తలు రావడంతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాంబు వార్త విని భయాందోళన చెందిన తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాలలకు పరుగులు తీశారు. తమ పిల్లలు ఎలా ఉన్నారో అంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని బస్సులు, వాహనాల్లో తరలివెళ్లారు. అయితే ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బసవేశ్వరనగర బసవేశ్వరనగర నేషనల్, విద్యాశిల్ప, సదాశివనగర పూర్ణప్రజ్ఞ, యలహంక పాఠశాలతో పాటు 60 కి పైగా ప్రైవేట్ పాఠశాలలకు ఉదయం 9గంటలకు ఈ–మెయిల్ వచ్చింది. స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు అందులోని సారాంశం. దీంతో పాఠశాలల యజ మాన్యం విద్యార్థులను పాఠశాలల గదులనుంచి బయటకు పంపించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని అణుఅణువునా క్షుణ్ణంగా గాలించారు.
గతంలోనూ బెదిరింపు ఘటనలు
నగర పోలీస్ కమిషనర్ దయానంద్ విలేకరులతో మాట్లాడుతూ నకిలీ బాంబు బెదిరింపు అని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. తమ పోలీస్ సిబ్బంది, బాంబుస్క్వాడ్ సిబ్బంది పాఠశాలలకు చేరుకొని తనిఖీలు చేశారన్నారు. గత ఏడాది ఇదే రోజు నగరంలోని 30 పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు ఇ–మెయిల్ ద్వారా బెదిరించారన్నారు. మహదేవపుర గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్, వర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్, మారతహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ అకాడమి స్కూల్, హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెయింట్‌విన్సెంట్ పౌల్‌స్కూల్, గోవిందపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇండియన్‌పబ్లిక్ స్కూల్‌లో బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరింపుకాల్‌చేశారన్నారు. ఇవి ఒట్టి బెదిరింపులేనని, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
భయాందోళన వద్దు:
ఇంట్లో వ్యాయామం చేస్తుండగా టీవీలో న్యూస్ చూసి భయపడి బయటికి వచ్చానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. తమ ఇంటి వద్ద నర్సరీ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈ–మెయిల్ వచ్చిందని, వెంటనే పోలీసులతో మాట్లాడగా నకిలీ బాంబు అని తేలిందన్నారు. ఎవరు భయపడరాదని, పిల్లలందరూ సురక్షితంగా ఉంటారని తెలిపారు. బెంగళూరు హబ్బ జరిగే సమయంలో అల్లరిమూకలు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారన్నారు. సైబర్‌క్రైం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, అన్నింటి ఆచూకీ కనిపెడతారని డీకే.శివకుమార్ తెలిపారు.
ఈ మెయిల్‌లో ఏముందంటే
బెదిరింపు ఈ–మెయిల్ ఉగ్రవాదులనుంచి వచ్చినట్లు అనుమానం వ్యక్తమైంది. అందులోని వివరాలు.. భారత్ అంతా విస్తరిస్తాం, ఇస్లాం మతంలోకి మారండి లేదా కత్తులదాడిలో ప్రాణాలు అర్పించండి అని ప్రస్తావించారు.
బాలుడి ఆగ్రహం
బాంబు బెదిరింపు ఘటనపై ఓ బాలుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. ఎంతో కష్టపడి స్కూల్‌కు తీసుకువస్తారు. మళ్లీ పాఠశాలకు వచ్చి మమ్ములను తీసుకెళ్తారు. బెదిరింపు లేఖ పంపిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని పేర్కొన్నాడు.
బాంబు బెదిరింపుతో పాఠశాలలకు పరుగులు తీసిన తల్లిదండ్రులు
ఉత్తిదే అని తేలడంతో
ఊపిరి పీల్చుకున్న బెంగళూరు ప్రజలు
గతంలోనూ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment