![బాధితుడు సరోన్ (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/7/06bng29-120041_mr.jpg.webp?itok=YijJGzey)
బాధితుడు సరోన్ (ఫైల్)
యశవంతపుర: మెట్రో రైలు కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు. బెంగళూరు జాలహళ్లి మెట్రో స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఈ ఘటన జరిగింది. వివరాలు.. కేరళకు చెందిన సరోన్ (23) అబ్బిగెరెలో ఉంటూ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం తండ్రి మృతి చెందగా, ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని బెంగళూరుకు తిరిగి వచ్చాడు. తండ్రి మరణం, కుటుంబం నుంచి దూరంగా ఉండడం తదితర సమస్యలతో తీవ్రంగా కలత చెందాడు.
రైలు– ఫ్లాట్‌ఫాం మధ్య చిక్కుకుని
ప్రయాణికుని మాదిరిగా స్టేషన్‌కు చేరుకున్న సరోన్.. ఓ మెట్రో రైలు రాగానే దాని కిందకు దూకాడు. సిబ్బంది గమనించి పట్టాలకు కరెంటు సరఫరాను ఆఫ్ చేసి, రైలు– ఫ్లాట్‌ఫాం మధ్య చిక్కుకుపోయిన బాధితున్ని బయటకు తీశారు. తలకు బలమైన గాయాలు కావటంతో సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. జాలహళ్లి మార్గంలో యశవంతపుర–నాగసంద్రల మధ్య గంట పాటు సర్వీసులు బందయ్యాయి. పీణ్యా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment