వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
కంప్లి: తామంతా భారతీయులం అనే సమన్వయ భావన రావాలని ఉజ్జయినీ సద్గురు పీఠ సిద్దలింగ రాజ దేశికేంద్ర శివాచార్య స్వామీజీ తెలిపారు. కొట్టూరు తాలూకా దూపద పుణ్యపురుష శ్రీగురు కరిసిద్దేశ్వర స్వామి దేవస్థానంలో గోపురం, కలశారోహణను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో సంస్కృతి, సంస్కారం, భిన్నాభిప్రాయాలు ఉన్నా తామంతా భారతీయులనే మనోభావనను, ఐక్యతను మరువరాదన్నారు. ప్రపంచంలో ఆడ, మగ రెండే తప్ప మరే కులం లేదన్నారు. కులమతాలు తాము సృష్టించుకున్నవే తప్ప దానికి ప్రత్యేక చట్టం లేదన్నారు. కష్టసుఖాల్లో అందరం కలిసికట్టుగా పని చేసి భారతీయతను చాటాలని హితవు పలికారు.
లారీ దూసుకెళ్లి
11 గొర్రెల మృత్యువాత
రాయచూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 11 గొర్రెలు దుర్మరణం పాలైన ఘటన యరమరస్ బైపాస్ వద్ద బుధవారం జరిగింది. మక్తల్ హొన్నప్ప తన గొర్రెల మందను తోలుకొని మన్సలాపూర్ వైపు వెళుతుండగా క్రాస్ వద్ద లారీ మలుపు తిప్పుతుండగా నియంత్రణ తప్పి మందపైకి దూసుకెళ్లింది. దీంతో తొమ్మిది గొర్రెలకు కాళ్లు విరిగాయి. మరణించిన గొర్రెల విలువ రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణతో ఆరోగ్యం
కంప్లి: గర్భిణులకు రోగముక్త శిశువు జననానికి తగిన సమయానికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు సూచించారు. సండూరు తాలూకా తోరణగల్లులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆశా కార్యకర్తలకు ఏర్పాటు చేసిన వైద్య శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పాజిటివ్ అని తేలగానే కాన్పు అయ్యే వరకు ప్రతి దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణి అని తెలియగానే నిపుణులతో తల్లీబిడ్డ రక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, మందులు సమయానుసారంగా అందించి సుఖప్రసవం అయ్యేలా ఆశా కార్యకర్తలు దిశానిర్దేశం చేయాలన్నారు.
అటవీ అధికారిపై చర్యకు వినతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో అటవీ శాఖ అధికారిపై చర్య చేపట్టాలని మాదిగ సమాజం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు రవీంద్ర జాలదార్ మాట్లాడారు. రాయబాగ ఎమ్మెల్యే దుర్యోధన ఐహోళైపె అటవీ శాఖాధికారి ఫోన్‌లో అవమానపరిచేలా, అసభ్య పదజాలంతో సంభాషించడాన్ని ఖండించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ అటవీ శాఖాధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో భీమయ్య, శంశాలం, నాగరాజ్, మౌనేష్, చంద్రు, ఆంజనేయ, వెంకటేష్‌లున్నారు.
సుత్తూరు మఠంలో శ్రీనాథ్
మైసూరు: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, మైసూరు ఎక్స్‌ప్రెస్‌గా పేరుపొందిన జవగల్ శ్రీనాథ్ బుధవారం కుటుంబంతో కలిసి చాముండి కొండ తప్పలిలో ఉన్న సుత్తూరు మఠాన్ని సందర్శించారు. శివరాత్రి దేశికేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కొంతసేపు స్వామీజీతో మాట్లాడారు.
హిమవద్ ఆలయంపై
డ్రోన్ కెమెరా
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని బండీపుర అభయారణ్యంలో హిమవద్ గోపాలస్వామి కొండపైన కొందరు డ్రోన్ కెమెరాను ఎగురవేశారు. డ్రోన్‌ను చూసి దగ్గరలో ఉన్న ఏనుగు కూడా భయపడింది. నిజానికి ఇక్కడ డ్రోన్లపై నిషేధం ఉంది. కొంతమంది బడాబాబులు కార్లలో వచ్చారు. ఎవరితో సంప్రదించకుండానే దేవాలయం చుట్టుపక్కల మొత్తం ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆలయం దగ్గరగా తరచూ వచ్చే ఏనుగును కూడా ఫోటోలు తీశారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు. ఇదంతా వైరల్ కావడంతో బండీపుర అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment