ఓ చిరుత పిల్ల
మండ్య: తాలూకాలోని కన్నలి గ్రామం చెరుకు పొలంలో మూడు చిరుత పిల్లలు శనివారం ప్రత్యక్షమయ్యాయి. గ్రామానికి చెందిన శ్రీనివాస్ పొలంలో ఈ కూనలు కనిపించాయి. బోరాపుర గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో ఉండే చెరుకు తోటలో పంట కోతలు సాగుతున్నాయి. ఈ సమయంలో కూనలు బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ యువకులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మరికొందరు తల్లి చిరుత వస్తుందేమోనని భయంతో దూరం నుంచి చూడసాగారు. అటవీ అధికారులు చేరుకుని చిరుత పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. తల్లి చిరుత కోసం గాలింపు చేపట్టారు. మండ్య, హాసన్ జిల్లాల్లో చెరకు తోటల్లో తరచూ చిరుత కూనలు దొరకడం గమనార్హం.
బంగారు ఆభరణాలు దోచుకుని పరారీ
మైసూరు: చీటీల వ్యవహారంలో మైసూరుకు పిలిపించుకుని ఒక న్యాయవాదిని మోసం చేసి అతడి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకుని ఓ దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. బెంగళూరు చంద్రాలేఔట్ నివాసి సి.గజేంద్ర బాధితుడు. మైసూరుకు చెందిన మురళి అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా న్యాయవాది గజేంద్రకు పరిచయమయ్యాడు. తాను మైసూరులో చీటీలు వేస్తానని నమ్మబలికాడు. చీటీలు వేయాలని గజేంద్రను కోరాడు. మురళి మాటలు నమ్మిన గజేంద్ర మైసూరుకు వచ్చి ఒక ప్రైవేటు హోటల్‌లో కలిశాడు. అతడితో మాట్లాడిన తర్వాత భోజనం చేసి కాసేపు అలా పడుకుని నిద్రపోయాడు. ఈ సమయంలో గజేంద్ర మెడలో ఉన్న 146 గ్రాముల బంగారు గొలుసు, ఐదు ఉంగరాలు, ఒక బ్రేస్‌లెట్‌ను మురళి దోచుకుని పరారీ అయ్యాడు. నిద్ర నుంచి లేచిన తర్వాత గజేంద్ర తాను నిలువునా మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. మండి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
రామ మందిర ప్రతిష్టాపనతో కాంగ్రెస్‌లో భయం
శివమొగ్గ: అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనను యావత్తు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం ఈ విషయం అసంతృప్తి, అసమాధానాన్ని కలిగిస్తోందని బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ఎద్దేవా చేశారు. శివమొగ్గలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో యడియూరప్ప ముచ్చటించారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన బీజేపీకి అనుకూలం అవుతుందనే భయం కాంగ్రెస్ పార్టీ నేతలో నెలకొందని తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని ఉపవాసం ఉంటూ నిష్టతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అన్ని పార్టీల నేతలను ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాలు పంపుతున్నారని కొనియాడారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment