మహిళా టెక్కీ చోరీ కుట్ర
ప్రియుని మొబైల్ దోపిడీ
ప్రైవేటు ఫోటోలు తొలగించాలని ప్లాన్
దొడ్డబళ్లాపురం: ప్రియునితో గొడవలు వచ్చి ఓ టెక్కీ యువతి.. అతని ఫోన్‌ని చోరీ చేయించింది. చివరకు ఆమె, ఆమె ముఠా దొరికిపోయిన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. వివరాలు.. మహిళా టెక్కీ శృతి, సహోద్యోగి వంశీక్రిష్ణతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. షికార్లకు, ఎన్నో పర్యాటక స్థలాలను సందర్శించారు. వందల కొద్దీ సెల్ఫీలు, రొమాంటిక్ భంగిమల్లో వీడియోలు తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోవాలని శృతి నిర్ణయించుకుంది. కానీ ప్రియుని ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి తనను ఇబ్బంది పెడతాడేమోనని ఆమె భయపడింది.
దారికాచి దోపిడీ
ఈ నేపథ్యంలో ఇద్దరూ బైక్‌లో బెంగళూరు బోగనహళ్లి వద్ద వెళ్తుండగా ఒక కారులో వచ్చిన నలుగురు యువకులు బైక్‌ను ఢీకొని గొడవకు దిగారు. వంశీక్రిష్ణ వద్ద ఉన్న రూ.90వేల విలువైన మొబైల్ లాక్కుని పరారయ్యారు. మొబైల్ పోతేపోయింది వదిలెయ్ అని యువతి ప్రియున్ని బుజ్జగించింది. అయితే వంశీక్రిష్ణ బెళ్లందూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా సురేశ్, మనోజ్, వెంకటేశ్, హొన్నప్ప అనే నలుగురు యువకులను అరెస్టు చేశారు. శృతినే తమను మొబైల్ దోచుకోవాలని, ఆ తరువాత ఫోన్‌లోని డేటాను తొలగించాలని చెప్పిందని తెలిపారు. శృతిని, దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలి ఘనకార్యంతో ప్రియుడు తెల్లబోయాడు.
Comments
Please login to add a commentAdd a comment