హనీ ట్రాప్ కేసులో పట్టుబడిన మహిళ
మొబైల్‌లో 8 మంది వీడియోలు
బాధితుల్లో ప్రముఖులు
శివాజీనగర: ప్రముఖ పార్టీలో నాయకురాలిగా చలామణి అవుతూ ఉండేది. సమాజంలో ప్రముఖురాలిగా కనిపించే ఆమె డబ్బు కోసం పెద్ద మనుషులకు వల విసిరేదని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భార్య చేసే ఘనకార్యాలకు భర్త వంతపాడడం విశేషం.
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌ను హనీ ట్రాప్‌లో పడేసిన కేసులో నలపాడ్ బ్రిగేడ్ కల్బుర్గి అధ్యక్షురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్‌ల లీలలు బయటకు వస్తున్నాయి.
ఫోన్లలో పలువురి వీడియోలు
మాలికయ్యనే కాదు అనేక మందికి వలవేసినట్లు ఆమె మొబైల్‌ఫోన్‌లో ఫోటోలు వీడియోలు లభించాయి. మంజులా పాటిల్ బ్యాగ్‌లో 6 మొబైల్‌లు దొరికాయి. సీసీబీ పోలీసులు వాటిని శోధించినప్పుడు ఎనిమిది మంది ప్రైవేట్ వీడియోలు చిక్కాయి. మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు, పోలీస్ అధికారి, పీడబ్ల్యూడీ అధికారి వారిలో ఉన్నారు. ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న మంజుళా, జిల్లాలో మహమ్మద్ నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
బెంగళూరులో అరెస్టు
పార్టీలో సమావేశాల్లో మాలికయ్యను ఆమె పరిచయం చేసుకుంది. తరువాత ఇద్దరు మొబైల్‌లు గంటల తరబడి మాట్లాడుకునేవారు. వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు. తరువాత వీటిని ముందుంచుకొని సొమ్ము కోసం బ్లాక్‌మెయిల్ చేయసాగింది. 2 రోజుల క్రితం బెంగళూరులో ఉన్న మాలికయ్య కుమారుడు రితీశ్‌ను కలవాలని మంజులా దంపతులు వచ్చారు. రితేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షలు జరిపి, న్యాయస్థానంలో హాజరుపరచారు. న్యాయస్థానం నిందితులను ఎనిమిది రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment