రేపు ఉప ఎన్నికల ఫలితాలు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఈనెల 13న జరిగిన సండూరు, శిగ్గాంవి, చెన్నపట్టణ ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సండూరు ఉప ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, అధికారుల సమక్షంలో ఈవీఎంలు ఉంచిన గదులను తెరచి వాటిని బయటకు తీసుకువచ్చి ఆయా గదుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు మధ్య కౌంటింగ్‌కు చర్యలు చేపట్టారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఉప పోరులో బీజేపీ–కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. బీజేపీ తరపున బంగారు హనుమంతు, కాంగ్రెస్ తరపున అన్నపూర్ణలు ఇద్దరు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇరు పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం కూడా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం సిద్దరామయ్య, మంత్రులు మూడు రోజులు నియోజకవర్గంలోనే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి బంగారు హనుమంతు తరపున మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నియోజకవర్గంలోనే తిష్టవేసి, ఆయన్ను గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర తదితరులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. సండూరులో ఒక్కసారి కూడా బీజేపీ గెలవకపోవడంతో ఈసారి గెలిచి రికార్డు సృష్టించాలని బీజేపీ నాయకులు చేయని ప్రయత్నాలు లేవు. రేపు ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పార్టీలు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని అభ్యర్థుల్లో ఆందోళన కూడా నెలకొంది.
సండూరుపైనే అందరి దృష్టి
నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ ధీమా
Comments
Please login to add a commentAdd a comment