వక్ఫ్ పేరుతో భూములను కబళించేందుకు కుట్ర
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో వక్ఫ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను భూములను కబళించేందుకు యత్నిస్తోందని మాజీ మంత్రి, గంగావతి జనార్దనరెడ్డి కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. గురువారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మా భూమి, మా హక్కు అనే కార్యక్రమంలో వక్ఫ్ అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేస్తున్న తీరును, అన్యాయాలను నిలువరించేందుకు ప్రధాని మోదీ బిల్లును తీసుకుని వచ్చారని, ఆ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చకు వస్తున్న తరణంలో కర్ణాటకలో 420 మంత్రి జమీర్ అహమ్మద్‌ను ముందు పెట్టుకుని సీఎం సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్రంలో రైతులను భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు భూములను వక్ఫ్ పేరుతో, అన్యాయంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఒక్క సెంటు కూడా రైతుల భూములు పోకుండా చేస్తామని అన్నారు. భూములను లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను, మోసాలను బహిర్గతం కావడంతో సీఎం సిద్దరామయ్య నోటీసులు వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారని, అయితే శాశ్వతంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా కర్ణాటక వైపు చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిలు మాట్లాడుతూ... రైతుల భూములను రక్షించేందుకు ఎంతవరకై నా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒక వర్గానికి మేలు చేసేందుకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జనం గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో రైతులకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రైతులు భూములను వక్ఫ్ పేరుతో ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాధికారి కార్యాలయం వద్ద బీజేపీ నాయకులతో పాటు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాధికారి కార్యాలయం వద్ద టెంట్ వేసుకుని, అక్కడే భోజనాలు చేసి, నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రైతులపై సీఎం సిద్దరామయ్య కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, బీజేపీ రైతు మోర్చ నాయకుడు ఐనాథరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి
రైతుల ఒక సెంటు స్థలం కూడా పోకుండా చూస్తాం
జిల్లాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ భారీ ధర్నా
Comments
Please login to add a commentAdd a comment