హుబ్లీ: కనీపెంచిన ఆరుగురు పిల్లలను డబ్బు కోసం ఇద్దరు తల్లులు తప్పదారి పట్టారు. ప్రియు లతో కలిసి కిడ్నాప్ డ్రామాకు తెరతీసి చివరకు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ధ్వారాడలో వెలుగుచూసింది. స్వయాన తమ పిల్లలను అపహరించిన ధార్వాడ జనత్నగర్ అన్నదమ్ముల భార్యలైన రేష్మ (23) ప్రియాంక (28), వీరి ప్రియులు ధార్వాడ జమాదర్ గల్లి నివాసి సునీల్‌కుమార్, షికారిపుర ముత్తురాజ్‌లను అరెస్ట్ చేసినట్లు జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. వివరాలు... ధార్వాడ జనత్నగర్లో ఉంటున్న మారుతికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు దీపక్ కాగా మరో కుమారుడు మృతి చెందాడు. రేష్మ భర్త దీపక్, ప్రస్తుతం సెలవులని పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మారుతీ కోడళ్లు రేష్మ, ప్రియాంక, వరుసగా తమ పిల్లలైన సాన్వి (8), సాత్విక్ (5), మన్విత (3), కృష్ణ (10), సూరజ్ (7), పించన (6)లను హాస్టల్లో విడిచి వస్తామని ఈ నెల 5న తీసుకెళ్లారు. అయితే అటు హాస్టల్లో లేకుండా, ఇంటికి రాకుండా ఉండటంతో ఈ 8 మంది కనిపించడం లేదని రేష్మ భర్త దీపక్ విద్యాగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ముత్తురాజ్ అనే వ్యక్తి గణేశ్‌కు ఫోన్ చేసి రూ.10 లక్షల డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆరుగురి పిల్లలు విక్రయిస్తానని బెదిరించాడు. తక్షణమే విషయం పోలీసులకు తెలియడంతో వారు నిఘా ఉంచి నిందితులతో పాటు పిల్లలు బెంగళూరు హెబ్బాళలో ఉన్నట్లు తెలుసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడు సునీల్‌కుమార్ రేష్మ ప్రియుడు, ఇక ప్రియాంక తన భర్త మృతి చెందాక ముత్తురాజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరు అప్పుడప్పుడు రేష్మ, ప్రియాంక సంబంధించిన వాటా ఆస్తిని ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. లేదంటే పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించే వారు, అన్నట్లుగానే పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకొని నేపాల్‌కు పారిపోవడానికి పథకం రూపొందించినట్లుగా కమిషనర్ వివరించారు. ప్రస్తుతం ఆ ఆరుగురు పిల్లలను ధార్వాడ బాలల సంక్షేమ హాస్టల్‌కు తరలించామని చెప్పారు. విద్యాగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రియులతో కలిసి కన్నబిడ్డలనే
అపహరించిన తల్లులు
Comments
Please login to add a commentAdd a comment