పరీక్షా ప్రాధికారలో ఇంటి దొంగలు
విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ జరిపించడం కేఈఏ కర్తవ్యం. ఆ సంస్థలో విద్యార్థుల సమస్త సమాచారం ఉంటుంది. దీనిపై కొందరు ఉద్యోగులు కన్నేశారు. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలతో కాసులకు కక్కుర్తి పడి అక్రమాలకు పాల్పడ్డారు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు.
బనశంకరి: ప్రభుత్వ కోటా కిందికి వచ్చే ఇంజనీరింగ్ కోర్సుల సీట్లను బ్లాక్ చేసి ప్రైవేటు కాలేజీలకు లాభం చేకూర్చేలా, అలాగే అర్హులైన అభ్యర్థుల పొట్ట కొడుతున్న ఘరానా ముఠా కటకటాల పాలైంది. నిందితులు ఎవరో బయటి వ్యక్తులు కాదు, సాక్షాత్తు కర్ణాటక పరీక్షా ప్రాధికార (కేఇఏ) ఉద్యోగులే కావడం విషాదం. కౌన్సెలింగ్‌లోని లోగుట్లను తెలుసుకుని మోసాల ద్వారా సొమ్ములు సంపాదించడమే వీరి పని. 10 మంది ముఠాని మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను తెలిపారు.
ఆప్షన్లు మార్చేసి దందా
● తమ ఆప్షన్లు మారిపోవడంతో కంగుతిన్న విద్యార్థులు కర్ణాటక పరీక్షా ప్రాధికార (కేఇఏ)కు ఫిర్యాదు చేయసాగారు. దీంతో పాలనాధికారి ఇసాలుద్దీ జెగాడియల్ గత నవంబరు 13 న మల్లేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● ఇందులో 52 సీఈటీ అభ్యర్థుల లాగిన్, పాస్‌వర్డ్స్, సీక్రెట్ కీ ని గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా వాడుకుని తప్పుడు ఆప్షన్లు ఇచ్చారు.
● ప్రముఖ కాలేజీల్లో ప్రభుత్వ కోటా కింద కు వచ్చే ఇంజినీరింగ్ సీట్లను బ్లాక్ చేసి ప్రైవేటు కాలేజీలకు లాభం చేరూర్చి, అర్హులైన అభ్యర్థులు నష్టపోయేలా వ్యవహరించారు.
● దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గోవా, శివమొగ్గ, దావణగెరె, కడూరు, బెంగళూరులో ప్రైవేటు కాలేజీలకు లాభం చేకూర్చేలా పై నిందితులు తప్పుడు ఆప్షన్లు నింపారు. కేఇఏ వెబ్‌సైట్ ద్వారా ఈ తతంగాన్ని నడిపారు.
వరుసగా అరెస్టులు
గత నెల 28 తేదీన నలుగురిని మెజెస్టిక్ బస్టాండులో అరెస్ట్ చేసి ప్రశ్నించగా వంచనకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అదేరోజు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రాధికారలోని మరో ఉద్యోగిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అంతేకాకుండా సీఈటీలో అర్హులైన విద్యార్థుల సమాచారాన్ని అక్రమంగా పలు కాలేజీలకు అందజేసేవారు. ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్, ఏసీపీలు హెచ్.కృష్ణమూర్తి, పవన్ విచారణ సాగించారు. ఈ దందాలో అనేకమంది దళారులు కూడా ఉన్నారు.
విద్యార్థుల లాగిన్‌ను దుండగులు
వాడుకున్నారు
అక్రమంగా ఇంజినీరింగ్ సీట్ల బ్లాకింగ్
విద్యార్థుల లాగిన్‌లు దుర్వినియోగం
10 మంది ఉద్యోగుల అరెస్టు
నిందితులు వీరే
నగరంలో జేపీ.నగర మూడోస్టేజ్ వాసి హర్ష, చిక్కమగళూరు జిల్లా కడూరువాసులు ప్రకా ష్, పునీత్, శశికుమార్, సాతనూరువాసి రవిశంకర్, బీటీఎంలేఔట్‌వాసులు నౌషద్ ఆలం, పురుషోత్తమ్, దిల్‌షాద్ ఆలం, యశవంతపురవాసి అవినాశ్, శేషాద్రిపురంవాసి తిలక్ నిందితులు. వీరి వద్ద నుంచి 13 మొబైల్స్, కొన్ని రికార్డులు, కాల్చివేసిన 3 ల్యాప్‌టాప్ శిథిలాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment