బోసిపోయిన విధానసభ
శివాజీనగర: ప్రభుత్వం రూ. 25 కోట్ల ఖర్చుతో బెళగావి సువర్ణసౌధలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను జరుపుతోంది. కానీ అధికార పక్షంలోనే శ్రద్ధ లేదనే విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఉదయం విధానసభ ఆరంభమైనపుడు మంత్రుల వరుస కుర్చీలు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా తక్కువ మంది వచ్చారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ, మంత్రులు లేరు, ఇలా అయితే సమావేశాలు వద్దు, వారు వచ్చిన తరువాతే ఆరంభించాలని పట్టుబట్టారు. ఆరోగ్యకర చర్చలు సాగాలి. రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ ఒక్కరే ఉన్నారు. ఊరికి ఒక్కరే పెద్దమనిషి అన్నట్లుగా ఉందన్నారు. జేడీఎస్ పక్ష నేత సీబీ సురేశ్ బాబు కూడా అభ్యంతరం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే వి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ, ఏక వ్యక్తి ప్రభుత్వమిది, మంత్రి మండలి లేదు అని హేళన చేశారు. ఐదు నిమిషాల్లో మంత్రులు వస్తారు. సమావేశాలను ప్రారంభిద్దామని స్పీకర్ సూచించారు. అర్ధరాత్రి వరకూ అసెంబ్లీ జరిపి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదు చేసేందుకు వెళ్లారేమో అని కొందరు ఎమ్మెల్యేలు అన్నారు.
అందరూ వచ్చాకే సభను
జరపాలన్న ప్రతిపక్షాలు
ఏక వ్యక్తి ప్రభుత్వమని ఆగ్రహం
మెడికల్ మాఫియా గుప్పిట్లో సర్కారు
నాసిరకంగా ఆస్పత్రులు: అశోక్
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మాఫియా గుప్పిట్లో ఉందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ విధానసభలో ఆరోపించారు. నాసిరకం ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచారు. అక్కడ మరుగుదొడ్లు లేవు. వైద్యులు లేరు. డ్రగ్ మాఫియా గుప్పిట్లో ప్రభుత్వముంది. కాలావధి ముగిసిన ఔషధాలను రోగులకు ఇస్తున్నారు. వైద్యమందక వందలాది మంది చనిపోతున్నారు. బళ్లారి, బెళగావిలో బాలింతలు మరణిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. బాలింతలే కాదు, చాలామంది పిల్లలు కూడా మృతిచెందారు, వారి మరణాలకు న్యాయం కావాలి కదా? నేడే ఈ అంశంపై చర్చించాలని స్పీకర్ యూటీ ఖాదర్‌కు విన్నవించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యమందక పేదలు, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలోని క్యాన్సర్ రోగులు సొంత డబ్బులతో ఔషధాలు, ఇంజెక్షన్లు కొంటున్నారని చెప్పారు. సర్కారీ ఆస్పత్రుల్లో లేవంటున్నారని చెప్పారు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో గొంతు కలిపారు. దీనిపై తరువాత అర్ధగంట చర్చకు అవకాశమిస్తాను, ఇప్పుడు కాదని సభాపతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment