అనాథలకు దుప్పట్ల పంపిణీ
మైసూరు: నగరంలో పెరుగుతున్న చలి, పొగమంచుతో బాధపడుతున్న యాచకులు, అనాథలు, కేఆర్ ఆస్పత్రిలోని రోగుల సహాయకులకు యూనిక్ యూత్ ఫౌండేషను, కేఎంపీకే ట్రస్ట్ సభ్యులు దుప్పట్లను పంపిణీ చేశారు. గత 15 రోజులుగా రాత్రి 12 నుంచి 2 గంటల వరకు సంచరిస్తూ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్, సంచార జాతులకు, గుడిసెల్లో నివసించే పేదలకు 300 కుపైగా రగ్గులను అందజేశారు. వీరికి పలు సంఘ సంస్థలు చేయూతనిస్తున్నాయి. రేఖా శ్రీనివాస్, శ్రేయస్, శివు, మదసిర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి నుంచి ఇంటికి దర్శన్
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్యకేసులో రెండవ నిందితునిగా అరెస్టయి, అనారోగ్యంతో తాత్కాలిక బెయిలు పొందిన నటుడు దర్శన్.. బుధవారంనాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వెన్నునొప్పితో బాధపడుతూ, ఆపరేషన్ చేయించుకోవాలని ఆస్పత్రిలో చేరారు. ఇంతలో హైకోర్టు పూర్తిస్థాయి బెయిలును మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ లేకుండానే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. భార్య విజయలక్ష్మి ఆయనను హొసకెరెహళ్లిలోని తమ ఫ్లాట్‌కి నేరుగా తీసికెళ్లారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి పవిత్రగౌడ కూడా మంగళవారం విడుదల కావడం తెలిసిందే.
మరో బాలింత మృత్యువాత
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో బాలింతల మరణాలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల బాలింత మృతిచెందిన సంఘటన చిక్కమగళూరు నగరంలో జరిగింది. శంకరపురం నివాసి సవిత (26) మృతురాలు. సవిత జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల తరువాత ఆమె ఆరోగ్యం విషమించింది. చివరి క్షణాల్లో జిల్లా ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు లేవని వైద్యులు చేతులెత్తేయడంతో ఆమెను బంధువులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక సవిత మరణించింది. జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే ఆమె చావుకు కారణమని బంధువులు ఆరోపించారు.
నా భర్త వాదన అబద్ధం
● అతుల్ భార్య వాంగ్మూలం
బనశంకరి: భార్య వేధింపులతో విరక్తి చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న కేసులో భార్య నిఖిత సింఘానియా, అత్త, బావమరిదిని మారతహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. విచారణలో నిఖిత పాత పాటే పాడుతోందని తెలిసింది. నిజమైన బాధితుడు అతుల్ కాదు, నేనే బాధితురాలినని పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. నేను, అతుల్ వేర్వేరుగా ఉంటున్నామని అతను చేసిన ఆరోపణలు అబద్ధం. అతని చావుకు– నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది తెలియదని, కోర్టులో తేల్చుకుంటానని ఆమె వాంగ్మూలంలో స్పష్టం చేసింది. వంట సరిగా చేయలేదని అతుల్ వేధించేవాడు, నాన్‌వెజ్ బాగాలేదని సతాయించేవాడు, అయినా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లలేదు. చివరికి అతని వల్లే ఇంటి నుంచి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది.
పోలీసు వాహనాల
ఫిట్‌నెస్ తనిఖీ
శివమొగ్గ: జిల్లా పోలీసు శాఖ వాహనాలు సుస్థితిలో ఉన్నాయా? సంచారానికి యోగ్యంగా ఉన్నాయా? అనేది జిల్లా ఎస్పీ జీకే మిథున్ కుమార్ బుధవారం పరిశీలించారు. డీఏఆర్ మైదాన ఆవరణలో వాహనాల పరిశీలన ప్రక్రియ జరిగింది. ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రక్కులు, టీటీ వాహన ట్యాంకర్, జాతీయ రహదారి గస్తీ, ఈఆర్‌ఎస్‌ఎస్–112 వాహనాలను స్వయంగా పరిశీలించారు. వాహనాల్లో టూల్ కిట్, ప్రథమ చికిత్స పెట్టె, అత్యవసర సామగ్రి సరిగా ఉన్నాయా అనేది తనిఖీ చేశారు. వాహన డ్రైవర్లు సమర్థంగా పనిచేయాలని సూచించారు. తరువాత డీఏఆర్ మైదానంలో ఫైళ్లు, క్యాంటీన్, ఆయుధాగారం, డాగ్ స్క్వాడ్ తదితరాలను సందర్శించారు. ఏఎస్పీ ఏజీ కార్యప్ప, డీఏఆర్ ఆర్‌పీఐ ప్రశాంత్‌కుమార్, యోగేష్ తదితరులున్నారు. కొన్నిరోజుల కిందట మైసూరు నుంచి హాసన్‌కు పోలీసు జీపులో వస్తున్న యువ ఐపీఎస్ వాహనం బోల్తా పడి దుర్మరణం చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు వాహనాల ఫిట్‌నెస్ పరిశీలన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment