1 నుంచి రైళ్లకు కొత్త నంబర్లు
హుబ్లీ: నైరుతి రైల్వే ఆధ్వర్యంలో 116 ప్యాసింజర్, ప్రత్యేక రైళ్లకు నిర్ధిష్ట రైలు సంఖ్యలతో కలిపి కొత్త నెంబర్లు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 0 సంఖ్యను 5, 6, లేదా 7 నుంచి ప్రారంభం అయ్యే సంఖ్యలతో బదలాయించారు. ఈ మార్పు 2025 జనవరి 1 నుంచి అమలు కానుంది. ప్రయాణికులకు ఇబ్బందులను తొలగించడానికి ఈ సవరించిన రైలు సంఖ్యలను గమనించాలని, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలని నైరుతి రైల్వే సీపీఆర్‌ఓ మంజునాథ కనుమడి ఓ ప్రకటనలో తెలిపారు.
అధిక లాభాలంటూ రూ.15.90 లక్షల వంచన
హుబ్లీ: టైల్స్ ఉద్యోగాల్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి స్థానిక ఓ వ్యక్తి నుంచి రూ.15.90 లక్షలను బదలాయించుకుని వంచించిన ఘటన జరిగింది. రామలకన్‌మాలి మోసపోయిన వ్యక్తి. టాంగో యాప్ ద్వారా పరిచయం అయిన మంజురాణి, గురుదేవసింగ్, సంగీత రాయ్ అనే వ్యక్తులు వ్యాట్సాప్ ద్వారా వివిధ రకాలుగా మభ్య పెట్టి దశల వారీగా తన ఖాతా నుంచి నగదును తమ ఖాతాలోకి బదలాయించుకున్నారని బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యథేచ్ఛగా రీఫిల్లింగ్ దందా
● 248 సిలిండర్లు స్వాధీనం
● ఒకరి అరెస్టు, ఇద్దరు పరారీ
హుబ్లీ: స్థానిక కోళ్లఫారంలో అక్రమంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల నుంచి వాణిజ్య సిలిండర్లను నింపుతున్న ముగ్గురిపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు. కై లాస్ గోదేరా అరెస్ట్ అయిన వ్యక్తి. ఈరణ్ణ హొసపేటె, మహమ్మద్ ఐనాపుర పరారయ్యారు. వీరి నుంచి 248 సిలిండర్లు, నాలుగు రీఫిల్లింగ్ మిషన్లు, రెండు గూడ్స్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఐనాపురకు చెందిన తారిహాళ జోడళ్లి రోడ్డులోని కోళ్లఫారంలో హెచ్‌పీ, భారత్‌గ్యాస్ కంపెనీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి వాణిజ్య వాడకం సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేసి విక్రయించే వారని సంబంధిత అధికారి విజయ్‌కుమార్ పత్తార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పర్మినెంట్ చేయాలని ర్యాలీ
రాయచూరు రూరల్: గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన సంచాలకులు శరణ బసవ మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహించే బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్, క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్, జవాన్, స్వీపర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.31 వేల వేతనాలు అందించాలన్నారు. పదవీ విరమణ చేసిన వారికి రూ.6 వేల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
సీఐడీ దర్యాప్తునకు డిమాండ్
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల మృతుల కేసుల విచారణను సీఐడీకి అప్పగించాలని దళిత సంఘర్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు హన్మంతప్ప మాట్లాడారు. బళ్లారి ఆస్పత్రిలో నిరంతరం బాలింతలు మరణిస్తున్న అంశంలో ద్రావణం సరఫరా చేసిన బంగ్లా ఫార్మా కంపెనీని బ్లాక్‌లిస్టులో చేర్చి వైద్యులు, అధికారులపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు.
కుక్కల పట్టివేతకు కార్యాచరణ
రాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కల పట్టివేతకు నగరసభ ప్రజా ప్రతినిధులు, అధికారులు నడుం బిగించారు. ఏ వీధిలో చూసినా కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను కరుస్తున్నాయి. బుధవారం మడ్డిపేటలో నగరసభ సభ్యుడు జిందప్ప వీధి కుక్కల బెడద నుంచి రక్షణకు వాటిని పట్టించే ఏర్పాట్లు చేశారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
హొసపేటె: మీర్ ఆలం టాకీస్ వెనుక నిర్మాణంలో ఉన్న విజయ్ సింధగికి చెందిన రెండంతస్తుల భవనంలో ఓ మహిళ ఆ భవనానికి నీటితో క్యూరింగ్ చేస్తుండగా ఆకస్మికంగా విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలో నివాసముంటున్న ఎన్.గణేశప్ప తన కూతురు లత(22)ను గంగాపుర గ్రామం రాణిబెన్నూరు తాలూకాకు చెందిన మోహన్‌తో ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. అనంతరం బ్రతుకు తెరువు కోసం హొసపేటెకు వచ్చి కూలి పనులు చేస్తోంది. వీరికి ప్రస్తుతం ఐదేళ్ల కూతురు జానవి, మూడేళ్ల కొడుకు లింగనగౌడ ఉన్నారు. బిల్డింగ్ గోడకు క్యూరింగ్ చేస్తూ నీరు వదిలి కిందకు దిగుతుండగా లత ప్రమాదవశాత్తు ఫ్లోర్‌లోని కరెంట్ వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను హొసపేటె ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని టౌన్ పోలీసులు తెలిపారు. ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment