ఘనంగా హనుమజ్జయంతి
మైసూరు: మైసూరు జిల్లాలోని సాలిగ్రామ పట్టణంలో ఆదివారం వందలాది భక్తుల సమక్షంలో హనుమాన్ జయంతిని నిర్వహించారు. పేటె ద్వారంలోని శ్రీ ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకారం చేసి ట్రాక్టర్‌పైన ప్రతిష్టించి ఊరేగించారు. అయోధ్య రాముడు తదితరుల విగ్రహాలను కూడా ఊరేగింపు చేశారు. మాజీ మంత్రి సా.రా.మహేష్, ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్, మంజెగౌడ తదితరులు పాల్గొన్నారు.
బీచ్‌లో పడవ బోల్తా,
రైడర్ అదృశ్యం
యశవంతపుర: ఉడుపి సమీపంలోని త్రాసి బీచ్‌లో అరేబియా సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. టూరిస్ట్ పడవ బోల్తా పడింది. ఘటనలో బోటు రైడర్ సముద్రంలో మునిగిపోయాడు. ఉత్తరకన్నడకు చెందిన రైడర్ రవిదాస్ అదృశ్యం కాగా అతని కోసం గాలిస్తున్నారు. బెంగళూరుకు చెందిన పర్యాటకుడు ప్రశాంత్‌ను తీసుకుని సముద్రంలో విహరిస్తుండగా అతి వేగం వల్ల బోటు బోల్తా పడింది. లైఫ్ జాకెట్ ధరించడంతో ప్రశాంత్ గండం నుంచి బయటపడ్డాడు. గంగోళ్లి పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు.
సిమెంటు ట్యాంకర్ పల్టీ
దొడ్డబళ్లాపురం: చెరువు కట్టపై వెళుతున్న సిమెంటు బల్క్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దొడ్డ తాలూకా మధురెలో జరిగింది. లారీ దొడ్డబళ్లాపుర నుంచి నెలమంగలకు వెళ్తోంది. పొగమంచు ఎక్కువగా ఉండడంతో డ్రైవర్‌కు దారి కనిపించలేదు. రెండు కరెంటు స్తంభాలను ఢీకొని పల్టీ కొట్టింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని దానిని పక్కకు తొలగించారు.
ఘనంగా గజ్జె పూజ
గౌరిబిదనూరు: గజ్జె పూజ నృత్య కళాకారుల నృత్య జీవితంలో ప్రధాన ఘట్టమని నాట్య శిక్షకురాలు దివ్యా శివనారాయణ్ తెలిపారు. ఇక్కడి హెచ్‌ఎన్ కళాభవనంలో పలువురు నూతన నృత్యకారిణులకు గజ్జె పూజ నిర్వహించారు. భరతనాట్యం పురాతనమైనది, శాశ్వత కళగా పేరుపొందిందని పేర్కొన్నారు. బాలల నృత్య ప్రదర్శనలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి.
భర్త చేతిలో భార్య హత్య
శివమొగ్గ: భార్యను భర్త చాకుతో దాడి చేసి పొడిచి హత్య చేసిన సంఘటన శివమొగ్గ నగరంలోని వాడి ఎహుదా లేఔట్‌లో ఆదివారం ఉదయం జరిగింది. ఏసీ మెకానిక్ అయిన యూసఫ్ రవూఫ్ (45).. భార్య రుక్సానా (38)తో ఉంటున్నాడు. ఏదో విషయమై ఉదయమే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహం పట్టలేక అతడు కత్తితో భార్యను పొడిచి చంపాడు. విషయం తెలిసి జిల్లా ఎస్పీ జీకే మిథున్‌కుమార్, డీఎస్పీ బాబు అంజినప్ప, సీఐ టి.గురురాజు ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
షూలో నాగుపాము
శివమొగ్గ: ఇంటి ముందు విడిచిన షూ లోపల నాగు పాము దూరింది. అదృష్టవశాత్తు చూసుకోవడంతో ముప్పు తప్పింది. ఆదివారం గోపాలగౌడ లేఔట్‌లో నివాసం ఉంటున్న ఆదాయ పన్ను శాఖకు చెందిన క్వార్టర్స్‌లో ఓ ఇంటి ముందు వదిలిన షూలోకి చిన్న నాగుపాము దూరింది. అది చూసిన ఇంటివారు వెంటనే స్నేక్ కిరణ్‌కు కాల్ చేశారు. ఆయన వచ్చి షూలో ఉన్న సర్పాన్ని బయటకు తీసి సంచిలో బంధించడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment