లోయలోకి కారు పల్టీ
● ముగ్గురు మృత్యువాత
యశవంతపుర: అల్టో కారు వేగంలో అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా పర్లడ్క వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. సుళ్య తాలూకా జట్టిపళ్య గ్రామానికి చెందిన అణ్ణు నాయక, చిదానంద, రమేశ్ నాయక పుత్తూరుకు వెళుతున్నారు. శనివారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి లోయలోకి పల్టీలు కొట్టింది. పుత్తూరు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. క్రేన్లతో కారును బయటకు తీసి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
ప్రైవేటు బస్సు బోల్తా
దొడ్డబళ్లాపురం: ప్రైవేటు బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో ఆరుమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన సంఘటన హొన్నావరలో జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేటు బస్సు హొన్నావర వద్ద అదుపుతప్పి బోల్తాకొట్టింది. క్షతగాత్రులను హొన్నావర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నంజన్నకు రికార్డు రాబడి
మైసూరు: దక్షిణ కాశీగా పేరొందిన జిల్లాలోని నంజనగూడులో వెలసిన శ్రీకంఠేశ్వర స్వామి (నంజుండేశ్వర) ఆలయంలో జరిపిన హుండీ లెక్కింపులో భారీ మొత్తంలో రూ.1.23 కోట్ల నగదు లభించింది. నెల రోజుల అవధిలో ఈ మేరకు నగదుతో పాటు 128 గ్రాముల బంగారం, 1.7 కేజీల వెండి సొత్తు, కొంతమేర విదేశీ నోట్లు లభించాయి. అమెరికాకు చెందిన 429, ఇంగ్లండ్‌కు చెందిన 10, కెనడాకు చెందిన 15, హాంకాంగ్‌కు చెందిన 80 కరెన్సీ నోట్లు వచ్చాయి. ఈఓ జగదీష్ కుమార్, అధికారులు వెంకటేష్ ప్రసాద్, విద్యుల్లతతో పాటు సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు.
గులాబ్‌జామూన్..
బంగారమెక్కడ?
దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్, ఇతర వీఐపీల పేర్లు చెప్పి బెంగళూరు నగల షాపుల్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని మోసం చేసిన శ్వేతా గౌడ అలియాస్ గులాబ్‌జామూన్ కేసులో పోలీసులు బంగారం రికవరీకి నానా తిప్పలు పడుతున్నారు. శ్వేతాగౌడను అరెస్టు చేసి ఇప్పటివరకూ 700 గ్రాముల బంగారాన్ని మాత్రమే సీజ్ చేయగలిగారు. శ్వేతాగౌడ నుంచి అక్రమంగా బంగారం కొన్న బాగలగుంటలోని రామ్‌దేవ్ జ్యువెలరీ యజమాని చన్నారామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 400 గ్రాముల బంగారం దొరికింది. వర్తూరు ప్రకాశ్ ఇచ్చిన బంగారంతో కలిపి మొత్తం 700 గ్రాములు అయ్యింది. మిగతా నగలను కరిగించి అమ్మేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం గురించి ఆమె నోరు మెదపడం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment