బెళగావిలో శంభాజి విగ్రహ వివాదం
దొడ్డబళ్లాపురం: బెళగావి నగరంలో అనగోళ ధర్మవీర శంభాజి సర్కిల్‌లో మరాఠా వీరుడు శంభాజి విగ్రహ ఏర్పాటు గొడవగా మారింది. బెళగావి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభయ్ పాటిల్, ఎంఈఎస్ నేత రమాకాంత కొండూస్కర్ మద్దతుదారుల మధ్య అగ్గి రాజేసింది. అనగోళలోని ప్రముఖ సర్కిల్‌లో 21 అడుగుల ఎత్తైన శంభాజి విగ్రహం పెట్టాలని మేయర్ సవితా కాంబ్లే అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. గురువారం ఉదయం విగ్రహ ఆవిష్కరణకు మేయర్ సవిత, ఉప మేయర్ ఆనంద్ చౌహాన్ వచ్చారు. ఇంకా పనులు మిగిలి ఉన్నాయని, అప్పుడే ఆవిష్కరణ వద్దని శ్రీరామసేన, హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, ఎంఈఎస్ నేత కొండూస్కర్ తలో వర్గానికి మద్దతిచ్చారు. ఇరువైపులా జనం చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
విజయేంద్రపై ప్రియాంక్ విసుర్లు
శివాజీనగర: మల్లికార్జున ఖర్గే తనయుడు కావడం వల్లనే మంత్రిని అయ్యానని బీ.వై.విజయేంద్ర ఆరోపించడంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే భగ్గుమన్నారు. బీదర్ కాంట్రాక్టరు సచిన్ పాంచాళ్ ఆత్మహత్య కేసులో వీరిద్దరూ విమర్శలు చేసుకుంటున్నారు. విజయేంద్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు ఎలాగయ్యాడు? ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎన్ని ఏళ్లు పని చేశారు? అని ప్రియాంక్ గురువారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బ్యాట్ పట్టుకోవడానికి రానివారిని ఐసీసీ అధ్యక్షున్ని చేశారన్నారు. కుటుంబ రాజకీయం మీలోనే ఉందన్నారు. కాంట్రాక్టరు సచిన్ డెత్‌నోట్‌లో తన పేరును ఉల్లేఖించలేదన్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్ డెత్‌నోట్‌లో అప్పటి మంత్రి ఈశ్వరప్ప పేరును ప్రస్తావించారని అన్నారు.
ప్రైవేటు బస్సు ఆహుతి
యశవంతపుర: రోడ్డుపై వెళుతున్న ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించి కాలిపోయిన ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా ఎత్తినహొళె గుంత వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. బెంగళూరు నుంచి కుక్కె సుబ్రమణ్యకు బయలుదేరిన స్లీపర్ కోచ్ బస్సులో ఇంజిన్‌లో మంటలు లేచాయి. డ్రైవర్ యోగేశ్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపి, 30 మంది ప్రయాణికులను కిందకు దించారు. కొంతసేపటికే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ కూడా బూడిదైంది. సకలేశపుర రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment