దొంగకు అరదండాలు
శివమొగ్గ: జిల్లాలోని శికారిపుర గ్రామీణ పోలీసులు పీఎస్ శివరాజు అనే దొంగను అరెస్టు చేశారు. తాలూకాలోని చుర్చుగుండి గ్రామానికి చెందిన శివరాజు (28) దొంగగా మారాడు. గత డిసెంబరులో ఓ మహిళ ఇంట్లో డబ్బు బంగారం ఎత్తుకెళ్లాడు. విచారణ జరిపి అరెస్టు చేశారు. అతని నుంచి 90 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి, హీరో హెచ్‌ఎఫ్ బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు.
కేక్ కట్‌చేసి.. జైలుపాలు
మైసూరు: పుట్టిన రోజును కొందరు వైరెటీగా జరుపుకోవాలనుకుంటారు. దాని వల్ల ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అదేమాదిరి స్నేహితులతో కలిసి ఓ ఆకతాయి బర్త్ డే కేక్‌ను పొడవైన కత్తితో కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. వివరాలు.. నగరంలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నగౌసియా నగరలో తబ్రేజ్ అనే యువకుడు లాంగ్‌తో కేక్ కోశాడు. ఫోటోలు, వీడియోలు తీసుకుని ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారడంతో స్థానిక పోలిసులు తబ్రేజ్‌ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పొడవైన కత్తులను ఉంచుకోవడం మారణాయుధాల చట్టం కింద నేరం కాబట్టి అరెస్టు చేశారు.
డ్రైవర్‌పై క్లీనర్ హత్యాయత్నం
మైసూరు: మినీ బస్సులో డ్రైవర్ పడుకొని ఉండగా క్లీనర్ ఇటుకతో కొట్టి హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన నంజనగూడులో జరిగింది. వివరాలు.. ఓ మినీ బస్‌లో సురేష్ (43) డ్రైవర్‌గా, సూరి క్లీనర్‌గా పనిచేస్తున్నారు. మైసూరులో ఓ కాలేజీ విద్యార్థులను కొడగు పర్యటకు తీసుకెళ్లి తిరిగి వచ్చారు. వారు ఇచ్చిన రూ. 9500 ను డ్రైవర్ సురేష్ జేబులో పెట్టుకుని శనివారం రాత్రి బస్సులోనే నిద్రపోయాడు. డబ్బుపై దుర్బుద్ధి పుట్టిన సూరి ఇటుక రాయితో తలపై బాది డబ్బు తీసుకెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌ను కొందరు చూసి ఆస్పత్రికి తరలించారు. సూరిపై బస్సు యజమాని షఫీవుల్లాఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని కోసం గాలింపు చేపట్టారు.
ఏఎస్‌ఐ పట్టివేత
యశవంతపుర: సీజ్ చేసిన ఆటో రిక్షాని వాపస్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసిన ఏఎస్‌ఐతో పాటు డబ్బులను తీసుకున్న వ్యక్తిని లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో కేజీహళ్లికి చెందిన మొహమ్మద్ సుజిత్‌కు చెందిన అటోను ఏదో నెపం చూపి సంజయనగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆటోను ఇవ్వాలని ఎఎస్‌ఐ విజయకుమార్‌ను అడిగారు. అయితే రూ.50 వేలు ఇస్తే వదులుతానని చెప్పటంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. ఎఎస్‌ఐ విజయకుమార్ తరఫున లంచం డబ్బులను స్వీకరిస్తున్న సయ్యద్ రిజ్వాన్‌తో పాటు ఏఎస్‌ఐని అరెస్ట్ చేశారు.
కేంద్రం రైలు చార్జీలు
పెంచలేదా?: సీఎం
దొడ్డబళ్లాపురం: మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆదివారందావణగెరెలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 శాతం కమీషన్ తీసుకుంటోందని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన ఆరోపణలపై స్పందించనని అన్నారు. ఆధారాలు కూడా చూపాలని, నిరాధార ఆరోపణలు సమంజసం కాదన్నారు. బస్సు చార్జీల పెంపుపై స్పందిస్తూ గతంలో కుమారస్వామి సర్కారు పెంచలేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు, రైలు చార్జీలు పెంచలేదా అన్నారు. కేపీసీసీ అధ్యక్షుని మార్పు హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక జడ్పీ టీపీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment