ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్యం
బొమ్మనహళ్లి: ఎన్నో ఏళ్లుగా డిమాండులో ఉన్న కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య వైద్యసేవల పథకాన్ని సీఎం సిద్దరామయ్య సోమవారం ప్రారంభించారు. విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ఉన్న సుమారు 250కి పైన ప్రముఖ ఆస్పత్రులో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డబ్బు చెల్లించకుండా అన్ని రకాల ఆరోగ్య సేవలను పొందవచ్చని సీఎం చెప్పారు. ఆస్పత్రుల యాజమాన్యాలు గౌరవంగా, మానవత్వంతో చికిత్సలు చేయాలని సూచించారు. ప్రమాదాల్లో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి, సాధారణంగా మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెక్‌లను సీఎం అందజేశారు.
ఎస్‌ఐ సస్పెన్షన్
దొడ్డబళ్లాపురం: నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్న ఎస్సై సస్పెండ్ అయిన సంఘటన బెంగళూరులో జరిగింది. బ్యాడరహళ్లి ఠాణాలో ఎస్‌ఐగా పనిచేసే కాశీ లింగేగౌడను పశ్చిమ డీసీపీ గిరీష్ సస్పెండ్ చేశారు. గతంలో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారని గౌడపై విధానసౌధ పోలీస్ట్‌షన్‌లో కేసు నమోదయింది. ఈ కేసులో బెయిలు పొందాడు.
మయూర అలంకారం
కోలారు: నగరంలోని శ్రీషణ్ముఖ సుబ్రమణ్య స్వామి ఆలయంలో సుబ్రమణ్య షష్టి సందర్భంగా స్వామి వారికి మయూర వాహన అలంకరణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
లంచం ఇస్తేనే డ్రైనేజీ శుభ్రం
దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు మురుగు కాలువలో చెత్త పేరుకుపోయింది, శుభ్రం చేయమని అడిగితే పంచాయతీ కార్మికులు రూ.200 లంచం అడిగారు. దీంతో వృద్ధ దంపతులు తామే కాలువను క్లీన్ చేశారు. ఈ సంఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా ఇటనాళ గ్రామంలో చోటుచేసుకుంది. లక్ష్మణ భజంత్రి, మహాదేవి దంపతుల ఇంటి ముందు డ్రైనేజీ చెత్తతో నిండి దుర్వాసన, దోమల సమస్య ఏర్పడింది. పంచాయతీ ఆఫీసులో చెబితే రూ.200 ఇస్తేనే వస్తామని చెప్పారు. దంపతులు చేసేదిలేక తామే స్వయంగా మురుగు కాలువలో దిగి శుభ్రం చేసారు. ఈ దృశ్యాలను గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. లంచగొండి వ్యవస్థ మారదా అని నెటిజన్లు మండిపడ్డారు.
నక్సల్స్ లొంగిపోవాలి: సీఎం
శివాజీనగర: నక్సలైట్లు లొంగిపోవాలని తానే పిలుపునిచ్చానని సీఎం సిద్దరామయ్య తెలిపారు. సోమవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమయంలో నక్సలైట్లు లొంగిపోతారనే వార్తలపై ఆయన స్పందించారు. నక్సలైట్లు లొంగిపోవాలని నేనే పిలుపునిచ్చా. ప్రజా జీవనంలోకి రావాలని కోరాను. లొంగిబాట్ల గురించి సమాచారం లేదు. అయితే వారు మనసు మార్చుకోవచ్చని తాను భావిస్తున్నాను అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment