కరెంటు తీగలు తగిలి దాణా లారీ దగ్ధం
దొడ్డబళ్లాపురం: పశువుల మేత లోడ్‌తో వెళ్తున్న లారీ విద్యుత్ లైన్ తగిలి రోడ్డు మధ్యలో కాలిపోయిన ఘటన దొడ్డ తాలూకా భక్తరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం లారీలో భక్తరహళ్లి నుంచి విజయపురకు వెళుతుండగా గ్రామం శివారులో విద్యుత్ లైన్ తగిలి నిప్పు రవ్వలు పుట్టి దాణా అంటుకుంది. కొంతసేపటికే లారీ అంతటా వ్యాపించాయి. మంటలు తగిలి రోడ్డు పక్కనే ఉన్న రాగి వాములు కూడా కాలిపోయాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జాతరలో 4 తులాల
చైన్ మాయం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలో ప్రసిద్ధి చెందిన ఘాటి సుబ్రమణ్య రథోత్సవంలో ప్రతి ఏడాదిలాగే ఈ దఫా కూడా జేబుదొంగలు రెచ్చిపోయారు. ఆదివారంనాడు ఘాటి క్షేత్రంలో బ్రహ్మ రథోత్సవం జరిగింది. దొడ్డ పట్టణ నివాసి అక్కయ్యమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. ఆ రద్దీలో అక్కయ్యమ్మ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు దొంగలు కత్తిరించారు. దొంగలు ఉన్నారు, మీ సామాన్లు జాగ్రత్త అని పోలీసులు మైక్‌లో ప్రకటిస్తూ ఉంటారు. కానీ చోరీలు ఆగడం లేదు. బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు అలాగే బాధతో వెళ్లిపోతుంటారు. ఘాటి రథోత్సవం, జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో చైన్ స్నాచర్లు వస్తుంటారని ఓ పోలీసు తెలిపారు. దొడ్డ గ్రామీణ పోలీసులకు బాధితురాలు అక్కయ్యమ్మ ఫిర్యాదు చేసింది.
లారీ– కారు ఢీ
● కుటుంబానికి గాయాలు
గౌరిబిదనూరు: సోమవారం తెల్లవారుజామున ఇక్కడ తొండేబావి సమీపంలో ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ మలుపులో ప్రమాదం జరిగింది. లారీ– కారు ఢీకొనడంతో కారులోని నలుగురు గాయపడ్డారు. తుమకూరు జిల్లా పావగడ తాలూకా రొప్ప గ్రామానికి చెందిన పవన్, మమత దంపతులు, పిల్లలు విశ్వాస్, శుభ్రత్‌లు బాధితులు. వీరు పాండిచ్చేరి టూర్‌కి వెళ్ళి వస్తున్నారు. ఘటనాస్థలి వద్ద లారీ ఢీకొంది. ముగ్గురికి ఓ మోస్తరుగా, ఓ బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. బాలున్ని బెంగళూరుకు తరలించారు. మంచేనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు. కారు మాత్రం గుర్తుపట్టలేనంతగా తుక్కుతుక్కయింది.
మారమ్మకు గంధ శోభ
బొమ్మనహళ్లి: ధనుర్మాసం, సోమవారం సందర్భంగా నగరంలోని బొమ్మనహళ్ళి పరిధిలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వార్డులోని పరంగిపాళ్యలో మారమ్మ దేవి అమ్మవారికి సిరిగంధంతో అలంకరించారు. ఉదయం నుంచి అర్చకులు వినయ్ దీక్షిత్ అభిషేకం, విశేష అలంకారం చేసి పూజలు చేశారు. మహా మంగళహారతి ఇచ్చిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
బాలిక ప్రాణం తీసిన
సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్‌లపై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment