ఉప లోకాయుక్త ఆకస్మిక తనిఖీ
సాక్షి బళ్లారి: కర్ణాటక ఉప లోకాయుక్త బీ.బీరప్ప నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. గురువారం ఆయన బళ్లారికి విచ్చేసిన నేపథ్యంలో నగరంలోని ఏపీఎంసీ, తహసీల్దార్ కార్యాలయం, సిటీ కార్పొరేషన్, వేణివీరాపురం సమీపంలోని భారీ డంప్ యార్డును పరిశీలించారు. ముందుగా నగరంలోని ఏపీఎంసీని పరిశీలించిన ఆయన అక్కడ రైతుల సమస్యలను తెలుసుకొన్నారు. ఏపీఎంసీలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, స్వచ్ఛతా లోపంపై మండిపడ్డారు. రైతులు, వ్యాపారులతో ఏపీఎంసీ పనితీరు గురించి ఆరా తీశారు. రైతుల నుంచి ఎక్కువ కమీషన్ తీసుకోవడం నేరమన్నారు. రెండు శాతం మాత్రమే కమీషన్ తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. అయితే రైతుల నుంచి 10 శాతం కమీషన్ తీసుకోవడం నేరమని మందలించారు. రైతుల నుంచి కమీషన్ తీసుకోవడాన్ని కట్టడి చేయాలని ఏపీఎంసీ అధికారులకు సూచించారు. పలువురు రైతులు తమ సమస్యలను లోకాయుక్త వద్ద విన్నవించారు.
రైతులను మోసగిస్తే సహించను
తూకాల్లో మోసం, విపరీతమైన కమీషన్, ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం నగర సమీపంలోని వేణివీరాపురం వద్ద ఏర్పాటు చేసిన డంప్ యార్డును పరిశీలించారు. దాదాపు 85 ఎకరాల్లో బృహత్ ఘనత్యాజ్య(డంప్‌యార్డు) నిర్వహణ సరిగా చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తయారు చేసిన ఎరువులను రైతులకు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి రోజు సేకరించే కసువును ఇక్కడికి తీసుకొచ్చి ఎరువుగా తయారు చేసిన దానిని రైతులకు అందించాలన్నారు. సరైనా విధంగా ఇక్కడ నిర్వహణ చేయడం లేదని పాలికె అధికారులు పరిశీలించకపోవడంపై కన్నెర్ర చేశారు. అనంతరం ఆయన సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో పరిశీలన చేసి వివిధ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, పని చేస్తున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. నగరంలో చట్టవిరుద్ధంగా కట్టడ నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు.
సమస్యలపై దృష్టి సారించండి
పరిశుభ్రత, డంప్ యార్డు, సిటీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు, హోటళ్లల్లో స్వచ్ఛత తదితరాలపై దృష్టి సారించాలని కమిషనర్‌కు సూచించారు. అలాగే అనంతపురం రోడ్డులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండటాన్ని గమనించారు. భూమి కేంద్రం, పాణిల సరఫరా, రైతుల సమస్యలు తదితరాల గురించి తహసీల్దార్‌ను అడిగి తెలుసుకొన్నారు. రెవిన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రామాణికంగా సేవ చేయాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న జీతాలను తీసుకోవాలే తప్ప వాటిని మినహాయించి లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లా ఆస్పత్రిని కూడా పరిశీలించి ఇటీవల బాలింతలు మృతి చెందిన ఘటనలపై కూడా ఆరా తీశారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు, వివిధ శాఖల అధికారులు, జిల్లా లోకాయుక్త అధికారులు పాల్గొన్నారు.
వివిధ కార్యాలయాల్లో సుడిగాలి పర్యటన
అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment