దర్శన్ ఆలయాల బాట
మైసూరు: నగర శివార్లలోని కెసరె సమీపంలోని షెడ్‌లో కమర్షియల్ సిలిండర్లకు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న నలుగురిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవికుమార్, మహేష్, మహదేవ, అభిషేక్ అనే నలుగురిని పట్టుకున్న పోలీసులు వారి నుంచి వివిధ కంపెనీల 127 సిలిండర్లను స్వాధీనపరచుకున్నారు. వీరు ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ల నుంచి వాణిజ్య వినియోగ సిలిండర్లలోకి గ్యాస్ నింపి అధిక ధరకు అమ్మేవారు. సమాచారం తెలిసి ఇన్‌స్పెక్టర్ పూవయ్య, పోలీసులు దాడి చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నగరంలో అగ్రహారలోని శివాని ఎంటర్‌ప్రైజెస్ యజమాని శివుతో సహా ఐదుగురిపై నరసింహరాజ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు.
చెట్టును కారు ఢీ,
ముగ్గురు బలి
యశవంతపుర: కారు అతి వేగంతో చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు బలయ్యారు. ఈ ఘటన కలబురగి జిల్లా సేడం తాలూకా యల్లమ్మగేట్ సమీపంలో జరిగింది. మృతులు సేడం తాలూకా మీనహబాళ వాసులు హళిమని(45), భీమేశ (44), తోట్నళ్లి వాసి సదాశివ (65). మౌనేశ అనే వ్యక్తి గాయపడ్డాడు. వీరు చించోళి మీదుగా సేడం వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొన్నారు. ముగ్గురు క్షణాల్లో మరణించారు.
టూర్‌కి వెళ్తే ఇల్లు లూటీ
మైసూరు: ఇంటి వెనుక కిటికీ తలుపు విరగ్గొట్టి చొరబడిన దొంగలు బీరువాలో భద్రపరిచిన రూ.7.24 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వివరాలు.. బోగాది ఎస్‌బీఎం కాలనీ నివాసి లతా శేఖర్ తమ కుమార్తె, అల్లునితో కలిసి టూర్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. పరిశీలించగా దొంగలు వెనుక వైపు కిటికీల ఊచలను కత్తిరించి లోపలకు జొరబడి బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తేలింది. సరస్వతీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కిల్లర్ బస్ ఢీకొని..
● వ్యక్తి, బాలిక దుర్మరణం
దొడ్డబళ్లాపురం: కేఎస్‌ఆర్టీసీ బస్సు, బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతిచెందిన సంఘటన దొడ్డ తాలూకా యలహంక– హిందూపురం రహదారి మార్గంలోని గొల్లహళ్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా కెళగినజూగానహళ్లికి చెందిన వెంకటేశ్ (31), చెల్లెలి కుమార్తె (12) మృతులు. బైక్‌పై దొడ్డబళ్లాపురం పట్టణానికి వెళ్తుండగా గొల్లహళ్లి వద్ద బెంగళూరు నుంచి హిందూపురానికి వెళ్తున్న బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఇద్దరూ తీవ్ర గాయాలతో మరణించారు. దొడ్డ గ్రామీణ పోలీసులు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
గుండెపోటుతో విద్యార్థి మృతి
తుమకూరు: కొంతకాలంగా చిన్నవయసులోనే గుండెపోటు వచ్చి గతిస్తున్న ఉదంతాలు కలవరం కలిగిస్తున్నాయి. ఊయలలోని పసిపాప, మూడో తరగతి బాలిక, హాకీ క్రీడాకారుడు ఇలా అనేకమందిని హతమార్చిన గుండెపోటుకు పీయూసీ ఫస్టియర్ విద్యార్థి కూడా బలయ్యాడు. గురువారం తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరులో ఉన్న వినాయక కాలేజీలో విద్యార్థి శమంత్ (17), ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అంతలోనే గుండెల్లో నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment