పట్టపగలు తూటా.. లూటీ
● బీదర్‌లో ఏటీఎంలో నగదు
నింపే సిబ్బందిపై కాల్పులు
● ఒకరు మృతి, మరొకరికి సీరియస్
● రూ. కోటి నగదుతో బైక్‌పై పరార్
● ఇద్దరు దుండగుల దుశ్చర్య
రాత్రివేళ దొంగలు వెల్డింగ్ మిషన్లతో ఏటీఎంలను కట్‌చేసి దోచుకోవడం తరచూ జరుగుతోంది. ఇప్పుడు గజదొంగలు పంథా మార్చారు. డబ్బును ఏటీఎంలోకి పెట్టక ముందే కాజేయడంపై కన్నేశారు. తుపాకులతో విరుచుకుపడి నగదుతో ఉడాయించారు. బీదర్ నగరంలో థ్రిల్లర్ సినిమాలో మాదిరిగా జరిగిన ఈ క్రైం.. దేశమంతటా మార్మోగిపోయింది. కాల్పుల్లో ఓ అమాయకుడు కన్నుమూయగా, మరొకరు చావు బతుకుల్లో ఉన్నారు. ఇంత దారుణం జరుగుతోంటే పోలీసులు ఏమయ్యారని జనం ప్రశ్నిస్తున్నారు.
బనశంకరి: పట్టపగలే ఇద్దరు ముష్కరులు ఏటీఎం క్యాష్ లోడింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపి కోటి రూపాయల బాక్సును ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ బీదర్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. బీదర్ నగరంలో మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీచౌక్‌లో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. అది డీసీపీ ఆఫీసుకు, కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. నిరంతరం జన రద్దీ, పోలీసుల సంచారం కనిపిస్తుంది. ఉదయం 11.30 సమయంలో ఏటీఎంలోకి నగదు నింపడానికి సీఎంఎస్ ఏజెన్సీ సిబ్బంది నగదు బాక్సుతో జీపులో వచ్చారు. వారిని బైకులో ఇద్దరు నల్ల దుస్తుల వ్యక్తులు వెంబడిస్తూ వచ్చారు. కానీ ఏజెన్సీ సిబ్బంది గమనించలేదు.
6 రౌండ్ల కాల్పులు
జీపును ఏటీఎం ముందు నిలిపి సిబ్బంది అల్యూమినియం నగదు పెట్టెను బయటకు తీసి అడుగులు వేశారో లేదో, సమీపంలో పొంచి ఉన్న దుండగుడు కారంపొడి విసిరి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. సుమారు 6 సార్లు కాల్చాడు. తూటాలు తగిలి వెంకట గిరీశ్ (42) అనే క్యాష్ ఉద్యోగి అక్కడికక్కడే చనిపోయాడు. శివకుమార్ (35) అనే ఉద్యోగి గాయాలతో కుప్పకూలిపోయాడు. తరువాత నగదు బాక్సును దుండగుడు మోసుకుంటూ బైక్‌లో పెట్టడానికి నానా ప్రయత్నం చేశాడు. పెట్టె బరువుగా ఉండడంతో ఓ దశలో బైక్‌తో సహా కిందపడిపోబోయారు. చివరకు బైక్ ట్యాంకు మీద పెట్టుకుని ఎలాగో వెళ్లిపోయారు.
పోలీసుల తనిఖీ
సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటె, ఏఎస్పీ పూజారి, వలయ ఐజీపీ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది తూటాలను, మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. నగరంతో పాటు జిల్లా అంతటా పోలీసులు చెక్‌పోస్టులుపెట్టి వాహన తనిఖీలు నిర్వహించారు.
బిహార్ ముఠాపై అనుమానం
ఈ దోపిడీదారులు బిహర్ కు చెందినవారని, 24 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. నగదు వాహనం డ్రైవరు నాగరాజ్ సురక్షితంగా బయటపడగా, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాడి విషయం క్షణాల్లోనే నగరమంతటా పాకిపోయింది. మృతుని, క్షతగాత్రుని కుటుంబీకులు విలపిస్తూ అక్కడికి చేరుకోవడంతో విషాదం తాండవించింది. నగరమంతటా భయం ఆవహించింది. పట్టపగలు ఇంత ఘోరం జరగడంతో పోలీసుశాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
అంతా ఐదారు నిమిషాలలో
తుపాకీ కాల్పుల శబ్ధాలతో స్థానికులు, దుకాణదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దోపిడీని జనం మొబైళ్లలో వీడియోలు తీయసాగారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించి ఉంటే దొరికిపోయేవారు. కానీ ఎవరూ పట్టుకునేందుకు సాహసించలేదు. ఆ క్షణంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడం గమనార్హం. అంతా ఐదారు నిమిషాల్లో ముగిసిపోయిందని స్థానికులు చెప్పారు. ఆ వాహనానికి గన్‌మెన్ లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment