అంధ విద్యార్థిని.. అద్భుత విజయం
మైసూరు: పట్టుదలకు ప్రతిభ తోడైతే ఎన్ని ఆటంకాలొచ్చినా పురోగమించవచ్చునని ఆమె చాటింది. బెళగావిలోని ఆంజనేయ నగరకు చెందిన యువతి బసమ్మ గురయ్యమఠ అంధురాలు. పుట్టుకతోనే ఈ వైకల్యం వల్ల ఎన్నో కష్టాలు పడింది. అందరూ సంతోషంగా జీవిస్తుంటే బసమ్మ చీకట్లో మగ్గిపోయేది. అయినా తనకు తాను ధైర్యం చెప్పుకుని సరస్వతీదేవిని నమ్ముకుంది. స్థానికంగానే డిగ్రీ పూర్తి చేసింది. తరువాత మైసూరు విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో పీజీలో చేరింది. సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఇందుకు గుర్తుగా శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించారు. బసమ్మ మాట్లాడుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాలలో పీహెచ్‌డీ చేయాలని ఉందని చెప్పింది. ఇప్పటికే నెట్, కే.సెట్ పరీక్షలను పాసైనట్లు తెలిపింది. అనుకున్నది సాధించి తీరాలి అని అమ్మ చెప్పిన మాటలతో ఇంత స్థాయికి వచ్చానని తెలిపింది.
మరో ఇద్దరు ప్రతిభావనులు
● ఎమ్మెస్సీలో సుమారు 10 బంగారం పతకాలను, 2 నగదు బహుమానాలను కొడగు జిల్లా గోణికొప్పకు చెందిన విద్యార్థిని వివినా స్విడల్ థోరస్ అందుకుంది. పీహెచ్‌డి చేసి ఉపాధ్యాయురాలిగా సేవలు చేసి పేద విద్యార్థులకు మంచి చదువును బోధించాలన్నదే ఆశయమని తెలిపింది.
● సంస్కృత విభాగంలో కాసరగోడు విద్యార్థిని సీమా హెగ్డే సుమారు 13 బంగారం పతకాలను, ఒక నగదు బహుమానం పొందింది. ఆమె భగవద్గీతను కంఠాపాఠంగా నేర్చుకోవడం విశేషం. సంస్కృతంలో మంచి పాండిత్యం ఆమె సొంతం. కాసరగోడులో భర్తతో జీవిస్తోంది. ప్రొఫెసర్ అవుతానని తెలిపింది.
పీజీలో బంగారు పతకం
Comments
Please login to add a commentAdd a comment