వేమన సిద్ధాంతాలు ఆదర్శం
చిక్కబళ్లాపురం: అందరూ వేమన తత్వ సిద్ధాంతాలను పాటించాలని కలెక్టర్ పిఎన్ రవీంద్ర అన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా పాలక మండలి ఏర్పాటు చేసిన మహా యోగి వేమన జయంతిలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వచన సాహిత్యం ద్వారా కుల దురాచార నిర్మూలన కోసం నిరంతర పోరాటం చేసిన వారు వేమన అని అన్నారు. జన సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వచన సాహిత్యాన్ని బోధించారని అన్నారు. రత్నవర్మ, ఎడిసి భాస్కర్, రవికుమార్ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు పల్టీ,
30 మందికి గాయాలు
మండ్య: వేగంగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి పల్టీ కొట్టగా, 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని మద్దూరు తాలూకాలోని రుద్రాక్షిపురం గ్రామం వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చామరాజనగర నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు.. వేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. బస్సులోని 30 మంది చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ముగ్గురికి తలలకు గట్టి దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను స్థానికులు మద్దూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ డాక్టర్.కుమార్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి గాయపడినవారిన పరామర్శించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు అడ్డంగా పడిపోవడంతో బెంగళూరు హైవేలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
కబ్జాల తొలగింపు
బనశంకరి: రాజరాజేశ్వరి నగర వలయం హెచ్‌ఎంటీ పరిధిలో కొందరు బృహత్ రాజకాలువను ఆక్రమించి నిర్మించిన షెడ్లను పాలికె అధికారులు తొలగించారు. తుమకూరు మెయిన్ రోడ్డు నుంచి ఎస్‌ఆర్‌ఎస్ సిగ్నల్ వైపునకు వెళ్లే ప్రభుత్వ పీయూసీ కాలేజీకి ఆనుకుని ఉన్న రాజకాలువలో సుమారు 100 మీటర్లు ప్రదేశంలో కబ్జాలు చేసి 45 షెడ్లు, గ్యారేజ్‌లను నిర్మించారు. సోమవారం ఆర్‌ఆర్ నగర వలయ కమిషనర్ సతీశ్, అధికారులు, పోలీసులు జేసీబీ యంత్రాలతో వాటిని నేలమట్టం చేశారు. అక్కడ నివసిస్తున్నవారిని ఖాళీ చేయించారు.
ఆస్పత్రిలో నిండు గర్భిణి మృతి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో బాలింతలు, గర్భిణిల మరణాలు ఆగడం లేదు. జిల్లాలోని సింధనూరులో అంబిక (30) అనే నిండు చూలాలు ఆదివారం రాత్రి రక్తస్రావంతో కన్నుమూసింది. వివరాలు.. నగరంలోని మహబూబ్ కాలనీకి చెందిన అంబికకు ఇదివరకే 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మళ్లీ గర్భం దాల్చి నెలలు నిండాయి. ప్రసవం కోసం గురువారం ఆస్పత్రిలో చేరారు. వైద్యలు పరీక్షించి కడుపులో పిండం అడ్డం తిరిగిందని, వేచి చూడాలని చెప్పారు. క్రమంగా ఆమె పరిస్థితి విషమించి మరణించింది. వైద్యులు సకాలంలో స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు సింధనూరు, దేవదుర్గ, రాయచూరు తాలూకా ఆస్పత్రుల్లో పది మంది బాలింతలు మరణించినట్లు సమాచారం.
ఉలవ కళ్లం.. లారీ దగ్ధం
యశవంతపుర: రోడ్డుపై రైతు ఉలవ పంట కళ్లం చేస్తుండగా దానిపై వెళ్లిన లారీ మంటల్లో కాలిపోయిన ఘటన దావణగెరె జిల్లా జగళూరు తాలూకా దోణహళ్లి సమీపంలో సోమవారం జరిగింది. సిమెంట్ మూటలను నింపుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి దావణగెరెకి వెళ్తోంది. ఉలవ కళ్లం మీద నుంచి వెళ్తూంటే లారీ ఇంజిన్‌లోకి ఉలవ చొప్ప చిక్కుకుని మంటలు లేచాయి. క్షణాల్లోనే లారీ మంటల్లో చిక్కుకుని బూడిదైయింది. లారీ డ్రైవర్, క్లీనర్ అపాయం నుంచి బయట పడ్డారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment