రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురి మరణం
గౌరిబిదనూరు: ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తొండేబావి సమీపంలోని కామలాపురం సమీపంలోని రహదారి మలుపులో రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు యువకులు మరణించారు. వివరాలు.. మంచేనహళ్ళికి చెందిన సంతోష్, మనోజ్, రెహమాన్ ముగ్గురూ బైక్‌పై గౌరిబిదనూరులో జరుగుతున్న దర్గా చూడడానికి వస్తున్నారు. అలాగే గౌరిబిదనూరు నుంచి నెలమంగలకు మరియణ్ణ, కిరణ్, శివశంకర్‌లు మరో బైక్‌లో పోతున్నారు. రోడ్డు మలుపులో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. పలువురికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంచేనహళ్ళికి చెందిన సంతోష్ (19), మనోజ్ (19) రక్తగాయాలతో మరణించారు. బెంగళూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరియణ్ణ (23) చనిపోయాడు. ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మంచేనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక మర్డర్ చేయడమే
● ఎక్స్‌లో ఓ వ్యక్తి పోస్టు
బనశంకరి: యాదగిరి జిల్లా కోడేకల్ కి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ఎక్స్‌లో తల్వార్ ఫోటో పోస్టు చేసి హత్య చేస్తానని హెచ్చరించాడు. మేము ఇల్లు కడుతుండగా కొందరు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏ ద్వారా ఒత్తిడి చేయడంతో మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి నేను ఇదే తల్వార్‌తో మర్డర్ చేస్తాను, లేకపోతే నా కేసు తీసుకోవాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ పోస్ట్ కు బెంగళూరు సిటీ పోలీస్ అకౌంట్ నుంచి.. ఏ పోలీస్‌స్టేషన్ కు మీరు వెళ్లారు అని ప్రశ్నించారు. కోడేకల్ ఠాణాకు వెళ్లానని, నేను మా తండ్రి నెలరోజులుగా ఠాణా చుట్టూ తిరుగుతున్నాము, పేదలం అని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు చర్యలు తీసుకోకపోతే నేను నా చట్ట ప్రకారం మర్డర్ చేస్తానని హెచ్చరించారు.
మారమ్మకు కొబ్బరి అలంకారం
బొమ్మనహళ్లి: నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో మారమ్మ దేవి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకరం తరువాత ఎండు కొబ్బరి పొడితో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
మద్యం ధరలు భగ్గు
శివాజీనగర: రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగిలింది. ధరలను 10 రూపాయల నుండి 45 రూపాయల వరకు పెంచారు. సోమవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. సాధారణంగా బడ్జెట్‌లో మద్యం రేట్ల పెంపు ప్రకటన ఉంటుంది. ఈసారి బడ్జెట్‌కు ముందుగానే ధర పెరిగింది. 6 నెలల క్రితం కూడా మద్యంపై పన్నులను పెంచారు. రూ.300 ధర లోపల ఉన్న మద్యం, బీర్ల ధరలు ఎక్కువగా పెరుగుతాయి. కొన్ని బీర్లు రూ.20, కొన్ని రూ. 40 వరకూ భగ్గుమన్నాయి. గ్యారంటీ పథకాలకు డబ్బును సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఇలా ధరలను బాదుతోందని మద్యంప్రియులు ఆరోపిస్తున్నారు.
ఫోన్‌పేలో లంచాల వసూళ్లు
● తూనికల శాఖలో దందా
● లోకాయుక్త తనిఖీలలో వెల్లడి
శివాజీనగర: బెంగళూరులోని తూనికల, కొలతల భవన్‌పై సోమవారం హఠాత్తుగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. ప్రతి పనికీ లంచం కోరడం, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం తదితర ఫిర్యాదులు రావడంతో లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్, ఉప లోకాయుక్త బీ.వీరప్ప నేతృత్వంలో దాడి చేపట్టడమైనది. 6 మంది ఎస్పీలతో పాటుగా 30 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ముందే 10 రోజులకు హాజరు సంతకం చేసి ఉండడం చూసి సదరు సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సమయంలో వీరప్ప.. ఉద్యోగుల ఫోన్ పేలను చెక్ చేశారు. ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో లంచాల సొమ్ము తీసుకున్నట్లు వెల్లడైంది. అధికారుల ఫోన్ పేలను కూడా పరిశీలించారు. రూ. 50 వేల నుంచి 1 లక్ష డబ్బులు ఎందుకు మీ అకౌంట్‌కు వచ్చిందని జ్యోతి అనే ఉద్యోగిని వీరప్ప నిలదీశారు. ఒక్కొక్కరి ఫోన్ పేలకు రూ. లక్ష వరకూ నగదు బదిలీలు జరిగాయి. కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment