నాన్నా.. ఏదీ నీ దీవెన?
యశవంతపుర: తండ్రి బైక్ ప్రమాదంలో చనిపోగా, పెళ్లిపీటలపై ఉన్న కూతురికి ఆ వార్త చెప్పకుండా పెళ్లిని పూర్తి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరెలో సోమవారం జరిగింది. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని కోరుకుంటాడు. అలాగే తండ్రి చేతుల మీదుగా వివాహం జరగాలని కూతురు ఆకాంక్షిస్తుంది. కానీ విధి నాటకంలో అంతా తారుమారైంది.
పెళ్లి పత్రికలు పంచి వస్తుండగా
తరీకెరెకి చెందిన చంద్రు కూతురు దీక్షిత అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం సాయంత్రం చంద్రు మరో ఇద్దరితో కలిసి పెళ్లిపత్రికలను పంచడానికి బైక్‌లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనటంతో చంద్రు, జతలో వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసి బంధువులు విషాదంలో మునిగిపోయినా తల్లీ, కూతురికి చెప్పలేదు. ఆ వార్త తెలిసినా, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పెళ్లి నిలిచిపోయి మరింత విషాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే చివరి నిమిషం వరకు చంద్రు పెళ్లి పనుల్లో ఉన్నాడని చెబుతూ సోమవారం మూడుముళ్ల వేడుకను పూర్తి చేయించారు. తండ్రి స్థానంలో మరో వ్యక్తిని ఉంచి కన్యాదానం చేశారు. అక్షింతలు, అతిథుల భోజనాల తరువాత చంద్రు భార్య, కూతురికి ఈ చేదు వార్త చెప్పగానే వారు బోరుమంటూ రోదించారు. అప్పటివరకు ఉన్న పెళ్లి కళ దూరమైంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులే అంత్యక్రియల పనులు పూర్తిచేశారు.
పెళ్లి పనుల్లో తండ్రి దుర్మరణం
విషయం దాచిపెట్టి కూతురికి పెళ్లి
చిక్కమగళూరులో గుండెల్ని తాకే ఘటన
Comments
Please login to add a commentAdd a comment