మత్తుగా వీడ్కోలు పలికేలా!
వైరా: మద్యం అమ్మకాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏటా తన రికార్డులను తానే చెరిపేస్తోంది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుండగా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు అమ్మకాల్లో పోటీ పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,308 కోట్ల మేర విలువైన మద్యాన్ని వైరాలోని డిపో ద్వారా వ్యాపారులు షాపులకు తరలించగా.. సోమవారం ఒకేరోజు రూ. 25కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తీసుకెళ్లడం విశేషం. దీంతో జిల్లాలో పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సర స్వాగత పలు కుతూ మంగళవారం జరిగే సంబురాల్లో మద్యం ఏరులై పారే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఇలా...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 వైన్స్, 48 బార్లతో పాటు మూడు క్లబ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 డిసెంబర్ 30వ తేదీ నాటికి ఆయా వైన్స్, బార్లు, క్లబ్‌లకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి రూ.2,300 కోట్ల మద్యం తరలించారంటే అమ్మకాలు ఎలా జరిగాయో ఊహించుకోవచ్చు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.60 కోట్ల మేర ఎక్కువని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ ఏడాది అమ్ముడైన మద్యంలో 29,063 మద్యం కేసులు, 19లక్షల కేసుల బీర్లు ఉన్నాయి.
బెల్ట్ జోరు
జిల్లాలోని చాలా చోట్ల వైన్స్‌కు సమాంతరంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల ఆయా షాపులను వైన్స్ యజమానులే ప్రోత్సహిస్తూ తమ షాపుల నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రింబవళ్లు అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే తమ ప్రైవేట్ సైన్యం ద్వారా బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైన్స్ యజమానులు లక్ష్యం మేరకు డిపో నుంచి మద్యం తరలిస్తూ అటు వైన్స్, ఇటు బెల్ట్ షాపుల్లో అమ్మకాలు చేపడుతున్నారని తెలుస్తోంది.
ఇంకా పెరిగేవే కానీ...
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్నాయి. అక్కడ గత ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టింది. దీంతో ఏపీ నుంచి మందుబాబులు సరిహద్దులోని తెలంగాణకు వచ్చి మద్యం సేవించి వెళ్లేవారు. కానీ అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం మద్యం షాపులను బార్లా తెరిచి అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అక్కడి నుంచి తెలంగాణలోకి వచ్చే వారు తగ్గిపోయారు. లేకపోతే ఇక్కడ మద్యం అమ్మకాలు మరింత పెరిగేవని తెలుస్తోంది.
ఒకేరోజు వైన్స్, బార్లకు రూ.25కోట్ల విలువైన మద్యం
ఈ ఏడాది రూ.2,308 కోట్ల సరుకు అమ్మకాలు
గత ఏడాది పోలిస్తే రూ.60 కోట్లకు పైగా ఎక్కువ
నెల వారీగా డిపో నుంచి తీసుకెళ్లిన మద్యం విలువ
నెల విలువ (రూ.కోట్లలో)
జనవరి 221
ఫిబ్రవరి 210
మార్చి 206
ఏప్రిల్ 181
మే 237
జూన్ 210
జూలై 180
ఆగస్టు 196
సెప్టెంబర్ 185
అక్టోబర్ 152
నవంబర్ 135
డిసెంబర్ 195
(30వ తేదీ నాటికి)
మొత్తం 2,308
Comments
Please login to add a commentAdd a comment