నిర్వహణ పనులకు అందని బిల్లులు
● వరద తాకిడితో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు ● రూ.కోట్ల విలువైన బిల్లుల కోసం ఎదురుచూపులు ● ఆర్‌అండ్‌బీలో ముందుకు సాగని పనులు
ఖమ్మంఅర్బన్: చేసిన పనులకు బిల్లులు రాక, చేయాల్సిన పనులకు నిధులు లేక ఆర్‌అండ్‌బీ పరిధిలో రహదారుల తీరు గందరగోళంగా మారింది. వరద ల ప్రభావంతో నాలుగు నెలల కిందట ఖమ్మం జిల్లా లో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఆ తర్వాత శాశ్వత మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు పంపించిన ప్రతిపాదనలకు నెల లు దాటుతున్నా మోక్షం లభించడం లేదు. ఫలితంగా చేసిన పనుల బిల్లుల కోసం, చేయాల్సిన పనుల నిధుల మంజూరు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
బిల్లులు రూ.25 కోట్లకు పైగానే
వరదల కంటే ముందే జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి ఏటా చేపట్టే మెయింటెనెన్స్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల విలువైన పనులు చేయించారు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లు గత మార్చి నుంచి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు వరదలతో దెబ్బతిన్న రహదారుల్లో అప్పటికప్పుడు మరమ్మతులు చేస్తేనే రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో అధికారులు స్థానిక కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి సుమారు రూ.30 కోట్ల విలువైన పనులు చేయించారు. ఇప్పటివరకు ఆ బిల్లులు కూడా అందలేదు. ఆపై వరదలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టుల శాశ్వత మరమ్మతుల కు సుమారు రూ.250 కోట్లకు పైగానే అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే మోక్షం లభించడం లేదు. దీంతో అటు కాంట్రాక్టర్లు.. ఇటు అధికారులు ఏం చేయాలో తోచక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడమే కాక శాశ్వత మరమ్మతుల ప్రతిపాదనలకు అనుమతి జారీ చేస్తే వచ్చే వర్షాకాలంలో సమస్యలు ఎదురుకావని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment