తునికాకు టెండర్లు ఇంకెప్పుడు?
● పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఖరారు ● ఆలస్యమైతే నష్టపోనున్న కూలీలు ● గతేడాదీ టెండర్లలో ఆలస్యం
పాల్వంచరూరల్: తునికాకు సేకరణకు టెండర్లలో జాప్యం జరుగుతుండడంతో ఇటు కూలీలకు ఉపాధి, అటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది సైతం ఇదే పరిస్థితి ఎదురైనా అధికారులు మేల్కొనకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేసవి పంటగా గిరిజన, గిరిజనేతర కూలీలు పిలుచుకునే తునికాకు సేకరణ కోసం ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తునికాకు సేకరణ ద్వారా వేలాది మంది కూలీలు అంతోఇంతో సంపాదించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గతేడాదీ ఆలస్యమే...
భద్రాద్రి జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో గతేడాది 33,300 స్టాండర్డ్ బ్యాగ్‌ల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం గతేడాది 39 యూనిట్లు ఏర్పాటుచేసి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యాన జనవరి 27వ తేదీనే టెండర్ జారీ చేశారు. ఫిబ్రవరి 7నుంచి 14వ తేదీ వరకు, మార్చిలో రెండు, మూడో విడతగా టెండర్లు నిర్వహించారు. టెండర్ జారీనే ఆలస్యం కావడం.. ఆపై స్పందన లేక మూడు విడతలుగా టెండర్లు నిర్వహించినా ఫలితం లేక 33,300 స్టాండర్ బ్యాగ్‌ల లక్ష్యానికి 13,478 స్టాండర్డ్ బ్యాగ్‌ల(41.7శాతం) సేకరణే జరిగింది. అయినప్పటికీ ఈ ఏడాది సైతం అధికారులు ముందడుగు వేయకపోవడం గమనార్హం.
పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి..
పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తునికాకు టెండర్లు పిలిచారు. తెలంగాణలో మాత్రం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే తెలంగాణకు చెందిన తునికాకు కాంట్రాక్టర్లు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ టెండర్లలో పాల్గొంటున్నారు. మన రాష్ట్రంలో మరింత జాప్యం జరిగే ఇటువైపు వచ్చే పరిస్థితి ఉండదు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా తునికాకు యూనిట్లు అమ్ముడుపోక నష్టం వచ్చినందున.. వీలైనంత త్వరగా అధికారులు స్పందిస్తేనే కూలీలకు ఉపాధి, అటవీశాఖకు ఆదాయం లభిస్తుందని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు.
సకాలంలో ఫ్రూనింగ్ చేస్తేనే...
టెండర్ల ప్రక్రియ పూర్తయితేనే కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకుని మార్చిలో తునికాకు మొడం కొట్టడం(ఆకు ఫ్రూనింగ్) మొదలుపెడితే ఆకు సకాలంలో చిగురిస్తుంది. ఆపై సేకరణతో ఫలితం ఉంటుంది. ఫ్రూనింగ్ ఆలస్యమైతే ఆకు చిగురించక లక్ష్యం నెరవేరకపోగా కూలీలకూ గిట్టుబాటు కాదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యను వివరణ కోరగా.. తునికాకు టెండర్ల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment