ఇక్కడే అప్రెంటిస్‌షిప్ ఇవ్వండి..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్థానికత ఆధారంగా వారి ఏరియాల్లోనే అవకాశం కల్పించేవారు. అయితే, ఈ విధానంతో కొన్ని ఏరియాల్లో సీట్లు నిండుతుండగా మిగతా ఏరియాల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో అధికారులు ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్ విధానంలో అప్రెంటిస్ షిప్ కేటాయిస్తుండడంతో ఒక ఏరియా వారికి ఇంకో ఏరియాలో సీటు దక్కుతోంది. అయితే, ఏడాది పాటు శిక్షణలో వచ్చే అరకొర నగదుతో అద్దె గదుల్లో ఉండడం కష్టమవుతున్నందున స్థానికంగా అవకాశం ఇవ్వాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
ఏటాది వ్యవధితో...
సింగరేణి సంస్థలో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఏడాడి కాల వ్యవధిలో అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది 1,600 ఖాళీలకు 2,400 దరఖాస్తులు అందాయి. కాగా, ఖాళీల్లో 80శాతం సింగరేణి ఉద్యోగుల పిల్లలు, సంస్థ ప్రభావిత ప్రాంతాలు, భూమి కోల్పోయిన వారి పిల్లలకు, మరో 20 శాతం ఇతరులకు కేటాయిస్తారు. ఇందులో ప్రధాన అర్హత ఐటీఐ పూర్తిచేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగా ఉండాలి. అయితే, ఐటీఐలో ట్రేడ్లు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తుండగా గతంలో ఏ ఏరియా వారికి అక్కడే అవకాశం కల్పించేవారు. అయితే, ఈ విధానంలో కొన్ని ఏరియాల్లోనే సీట్లు నిండి పలువురికి నిరాశ ఎదురవుతోంది. ఇంకొన్ని ఏరియాల్లో సీట్లే నిండడం లేదు.
తెరపైకి కౌన్సెలింగ్
ఏరియాల వారీగా ఖాళీలు, సీట్ల భర్తీని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ ఏడాది కౌన్సెలింగ్ విధానాన్ని మొదలుపెట్టారు. ఖాళీలు, ప్రతిభ ఆధారంగా ఒక్కో ఏరియాలోసీట్లు భర్తీ చేస్తూ మిగిలిన వారికి ఇతర ఏరియాలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఒకదశ కౌన్సెలింగ్ పూర్తి కాగా, రెండో విడత జరగాల్సి ఉంది. అయితే, ఈ విధానంలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అప్రెంటిస్ కాలంలో ట్రేడ్ల ఆధారంగా కొందరికి నెలకు రూ.8వేలు, ఇంకొందరికి రూ.7వేలు చెల్లిస్తున్నారు. ఇతర ఏరియాలో సీటు వస్తే ఈ నగదుతో జీవనం కష్టమవుతున్న పాత విధానాన్నే అమలుచేయాలని కోరుతున్నారు.
ఇతర ఏరియాల్లో సీట్లతో ఇబ్బంది
పడుతున్నామంటున్న అభ్యర్థులు
సింగరేణిలో వెల్లువెత్తుతున్న వినతులు
1,600 ఖాళీలకు 2,400 దరఖాస్తులు
అలా ఇవ్వడం సాధ్యం కాదు
చాలామంది ఒకే ఏరియా కోరుతుండడంతో ఇంకొన్ని చోట్ల సీట్లు మిగులుతున్నాయి. అందుకే కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా కేటాయిస్తున్నాం. ఏమైనా మార్పులు చేయాలంటే ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
– సయ్యద్ హబీబ్ హుస్సేన్, జీఎం (హెచ్‌ఆర్‌డీ)
ఎక్కడి వారికి అక్కడే అవకాశం ఇవ్వాలి
నిరుద్యోగులకు శిక్షణ ఒక వరం లాంటిది. కానీ యాజమాన్యం ఇతర ఏరియాల్లో కేటాయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు కార్మికులు సైతం ఉద్యోగాలకు సెలవు పెటి ్టపిల్లలతో ఉండాల్సి వస్తున్నందున ఎక్కడి వారికి సీట్లు కేటాయించాలి.
– ఎం.డీ.రజాక్, ఏరియా ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment