మిర్చి రైతు కంట్లో కన్నీరు
మధిర: ఈ ఏడాది పండిన కొత్త మిర్చి మార్కెట్‌లోకి వస్తుండటం, ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం.. నూనె తీసే మిల్లులు కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటుండటం వంటి కారణాలతో మిర్చి ధర నానాటికీ క్షీణిస్తోంది. ఖమ్మం జిల్లాలోని 42 కోల్డ్ స్టోరేజీల్లో 45 లక్షల మిర్చి బస్తాల నిల్వకు అవకాశం ఉండగా, గత ఏడాది పండించిన పంట సుమారు 40 శాతం మేర ఇంకా నిల్వ ఉంది. ఇంతలోనే ఈ ఏడాది పండిన పంటను రైతులు తీసుకొస్తుండగా నిల్వ మిర్చి కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ అమ్ముదామనుకున్నా ధర తగ్గిస్తుండటం, వారం తర్వాత వస్తే ఇంకా తగ్గించి అడుగుతుండటంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత ఏడాది తేజా రకం మిర్చిని కల్లంలో క్వింటాకు రూ.24 వేలకు అడగగా.. ఇప్పుడు రూ.15 వేలకు మించి పలకడం లేదు. ఫలితంగా ఇంటి అవసరాలకు తోడు అప్పులు తీర్చేందుకు మార్కెట్‌కు వస్తున్న రైతులకు కన్నీరే మిగులుతోంది.
ఈ నష్టం పూడ్చుకునేదెలా?
రైతులకు తోడు కల్లాలు, కోల్డ్ స్టోరేజీలో మిర్చి స్టాక్ పెట్టిన వ్యాపారులకు సైతం నష్టం ఎదురవుతోంది. ఇదిలా ఉండగా గత ఏడాది మిర్చికి మంచి ధర ఉండటంతో కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు బ్యాంకు రుణంతోపాటు రైతులకు చేబదులుగా నగదు ఇచ్చారు. కానీ నాటికి నేటికి ధరలో సగం తేడా ఉండటం, తీసుకున్న రుణాలపై వడ్డీలు, నిల్వచేసిన బస్తాలకు అద్దె, ఎగుమతి, దిగుమతి తదితర ఖర్చులు కలిపి క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు నష్టం వస్తోంది. కాగా, కొందరు రైతులు నిల్వ చేసిన సరుకును అమ్ముకుంటే వచ్చే డబ్బు పోను కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలకు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. ఫలితంగా ఇంకా కొన్నాళ్లు వేచి ఉండాలనే భావనతో రైతులు కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ వైపునకు వెళ్లడం లేదు. దీంతో అద్దె కూడా రాక కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులూ నష్టాల్లో కూరుకుపోతున్నారు.
కర్ణాటక నుంచి దిగుమతి
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పండే తేజ్యా రకం మిర్చిని చైనా, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే, ఇదే రకాన్ని పోలిన బ్యాడిగి రకం మిర్చిని రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఇంతలోనే విదేశాలకు ఎగుమతులు మందగించాయి. ఇక బ్యాడిగి రకం మిర్చి కర్ణాటకలో క్వింటా రూ.6 వేల నుంచి రూ.7 వేలకు లభిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మిర్చి నూనె ఫ్యాక్టరీల యజమాన్యాలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. సాధారణంగా ఈ మిల్లులకు ఏటా 6 లక్షల బస్తాల మిర్చి అవసరమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాకుండా కర్ణాటక నుంచి తెప్పిస్తుండటంతో స్థానిక రైతులకు ధర దక్కకపోగా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు తరగడం లేదు.
మార్కెట్‌లోకి కొత్త మిర్చి రాక ప్రారంభం
తగ్గిన ఎగుమతులు.. కర్ణాటక నుంచి ఫ్యాక్టరీలకు దిగుమతి
మంచి ధర కోసం నిల్వ చేసిన రైతులకు తీరని నష్టం
రైతులకు తోడు వ్యాపారులూ నష్టాల ఊబిలోకి..
మధిర మండలం ఆర్లపాడుకు చెందిన మందడపు అప్పారావు గత ఏడాది సాగు చేసిన మిర్చిని కల్లంలో క్వింటాకు రూ.23 వేల చొప్పున అడిగారు. అయితే, మరింత ధర వస్తుందనే భావనతో 120 బస్తాల మిర్చిని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాడు. ఇప్పుడు మార్కెట్‌కు శాంపిల్ తీసుకొస్తే క్వింటాకు రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో క్వింటాకు రూ.11 వేలు వరకు నష్టపోతుండగా స్టోరేజీ అద్దె, తీసుకున్న రుణానికి వడ్డీ కలిపి మరో రూ.4 వేలు వెరసి క్వింటాకు రూ.15 వేలు నష్టం ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో మిర్చి సాగు చేయాలంటేనే భయమేస్తోందని అప్పారావు వాపోయాడు.
అందరికీ నష్టమే
ఈ ఏడాది రైతులు, వ్యాపారులతో పాటు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలకూ నష్టమే. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తోంది. ఈ సమయాన ఎగుమతులు లేవు. మరోపక్క ఇతర రాష్ట్రాల్లో మిర్చి తక్కువ ధరకే లభిస్తుండటంతో ఇక్కడి వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.
–మందడపు రామకృష్ణ,
కోల్డ్ స్టోరేజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు
రోజురోజుకూ తగ్గిపోతోంది
కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన మిర్చిని అమ్ముదామని నెల రోజులుగా మార్కెట్‌కు వచ్చివెళ్తున్నా. పంట పండినప్పుడు కల్లంలో క్వింటా రూ.21 వేలకు అడిగారు. కానీ ఇప్పుడు రూ.12 వేలకు మించి ధర పలకడం లేదు. అద్దె, ఖర్చులు, వడ్డీలు కలిపితే నష్టం భారీగానే ఉంటుంది.
–కావూరి వెంకటేశ్వరరావు,
ఎర్రమాడు
Comments
Please login to add a commentAdd a comment