పాలకవర్గంలో స్థానంపై ఆసక్తి
పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలో భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం తర్వాత అంతటి భక్తుల రద్దీ, ఆదాయం కలిగిన పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో స్థానం కోసం 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాల్వంచ మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) దేవస్థానం ఉండగా, గత పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది మార్చి 24న ముగిసింది. అంతకుముందే నూతన పాలకమండలి నియమాకం కోసం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా పోటాపోటీగా 52మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ నోటిఫికేషన్ పక్కన పెట్టిన ఉన్నతాధికారులు గతనెల 22న మరోమారు నోటిఫీకేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 20రోజుల గడువు ఇవ్వగా 30మంది దరఖాస్తులు సమర్పించారు. తొలి విడతతో పోలిస్తే ఈసారి దరఖాస్తుల తగ్గడం గమనార్హం. కాగా, పాల్వంచ, కొత్తగూడెం పట్టణం, మండల పరిధిలోని అధికార పార్టీ శ్రేణులు ఇందులో ఉన్నట్లు తెలిసింది. అధికార పార్టీలోని నాయకుల అనుచరులు పాలకవర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తుండగా ఆయా నాయకులు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ విషయమై దేవాదాయ శాఖ ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి మాట్లాడుతూ పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలిలో స్థానం కోసం 30దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఆతర్వాత ఉన్నతాధికారుల సూచన మేరకు నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీకి
30 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment