శిల్పారామం తరహాలో ‘వెలుగుమట్ల’
● అదేస్థాయిలో ఖిలాను తీర్చిదిద్దుతాం... ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది శిల్పారామం తరహాలో వెలుగుమట్ల పార్క్‌ను అభివృద్ధి చేయడమే కాక జూ పార్క్ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఇక ఖమ్మం ఖిలాపై రోప్ వే అందుబాటులోకి రానుందని తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. ఖమ్మంలోని పుట్టకోటలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రిగా తాను ఏ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఉమ్మడి జిల్లాలోని సమస్యల పరిష్కారమే ధ్యేయమని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో అధికారుల మార్పిడి, వరదల కారణంగా కొంత కాలం ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు అభివృద్ధి పనులు వడివడిగా సాగుతున్నాయని చెప్పారు.
ఎకో పార్క్‌గా అభివృద్ధి
ఖమ్మంలోని 500 ఎకరాల్లో విస్తరించిన ఉన్న వెలుగుమట్ల అటవీ పార్క్‌ను శిల్పారామం మాదిరి ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక్కడ జూ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఖిల్లాపై రోప్ వే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులన్నీ కొత్త ఏడాదిలో పూర్తిచేయాలన్నది లక్ష్యమని తెలిపారు. ఇక రూ.700 కోట్లతో మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఖమ్మంలో రూ.220 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాక రఘునాథపాలెం బైపాస్‌లో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం, మండల కేంద్రంలో స్వామి నారాయణ్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నిర్మాణం, అక్కడే ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నగరం చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుండడంతో ఖమ్మంకు రింగ్ రోడ్డు ఏర్పడేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి చెప్పారు. ఇక గోదావరి జలాలను పది నియోజకవర్గాలకు తీసుకురావడం తన లక్ష్యం కాగా, వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తామని తుమ్మల వివరించారు. అలాగే, పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు రైల్వేలైన్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఈసమావేశంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, వీ.వీ.పాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదబాబు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment