ఏఎస్‌ఆర్‌బీలో ఐదో ర్యాంకు
● జాతీయస్థాయిలో సత్తా చాటిన సుబ్లేడు వాసి లత ● ‘ఐకార్’లో శాస్త్రవేత్తగా అవకాశం
తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన పోలెపొంగు లత అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈమేరకు ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఐదో ర్యాంకు సాధించడం ద్వారా జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐకార్)లో శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకుంది. సుబ్లేడుకు చెందిన పోలెపొంగు జగ్గయ్య – కృష్ణకుమారికి కుమార్తె లతతో పాటు కుమారుడు లక్ష్మ ణరావు ఉన్నారు. లత సుబ్లేడులోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వరకు, ఐదు నుండి 10వ తరగతి వరకు వైరా ఎస్సీ బాలికల హాస్టల్‌లో చదివింది. ఆతర్వాత ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో, బీఎస్సీ అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో, ఎమ్మెస్సీ(ప్లాంట్ పాథాలజీ) మహారాష్ట్రలో పూర్తిచేశాక హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ఆపై అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై తాను బీఎస్సీ చదివిన అశ్వారావుపేటలోని అగ్రి కల్చర్ కాలేజీలోనే పాఠాలు బోధిస్తోంది.
తొలి ప్రయత్నంలోనే...
ఓ పక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూనే లత అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ) నిర్వహించే పరీక్షకు సిద్ధమైంది. ఈమేరకు తొలి ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించింది. తద్వారా మొక్కలపై పరిశోధన కోసం శాస్త్రవేత్తగా ఎంపికవాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. వచ్చే నెలలో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఆమెకు పోస్టింగ్ వచ్చే అవకాశముందని తెలిసింది. ఈ సందర్భంగా మొక్కల వ్యాధి నివారణ, తక్కువ ఖర్చుతో రసాయన, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి అధిక, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేయాలన్నదే తన లక్ష్యమని లత వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment