● మీ సేవ కేంద్రాల్లో ఇష్టారాజ్యం ● రెవెన్యూ సిబ్బందితో
సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఒకరు నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పోటీ పరీక్షల నిమిత్తం కులం ధ్రువీకరణ పత్రం కోసం స్థానికంగా ఉండే మీసేవ నిర్వాహకుడిని సంప్రదించాడు. రూ.500 పంపిస్తే సర్టిఫికెట్ అందిస్తానని చెప్పడంతో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించాడు. అనంతరం మీసేవ కేంద్రంలో మీ సర్టిఫికెట్ కోసం రూ.45 సర్వీసు చార్జీ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. రూ.45 తీసుకోవాల్సిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు రూ.500 వసూలు చేసినట్లు గుర్తించాడు.
కౌటాల(సిర్పూర్): సులభంగా.. వేగంగా అనే నినాదంతో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రైతులు, నిరాక్ష్యరాసుల అమాయకత్వాన్ని, నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దందాలకు తెర లేపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతతోపాటు విద్యార్థుల నుంచి నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జైనూర్‌లోని ఓ మీసేవ కేంద్రం అనుమతిని కలెక్టర్ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జనన, మరణ, కులం, ఆదాయం, నివాసం, భూములకు సంబంధించి మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు.. ఇలా ప్రతీ దాని కోసం ‘మీ సేవ’ గడప తొక్కాల్సిందే. దాదాపు 500 రకాల సేవలందిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 57 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతుండగా, ఆతర్వాత ధ్రువీకరణ అప్లికేషన్లు అధికంగా ఉంటున్నాయి. అధిక వసూళ్లను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ఇటీవల క్యూర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కొత్తవి అందుబాటులోకి వస్తేనే..
జిల్లాలో ప్రస్తుతం మీసేవ కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. దరఖాస్తుదారులకు మరో అవకాశం లేకపోవడంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు చెప్పిందే వేదంగా మారుతోంది. పనుల కోసం వెళ్లినవారిని రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. ఏళ్ల తరబడి కేంద్రాలు నిర్వహిస్తున్న వారు సాధారణ ప్రజలతో చులకనగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు నూతన మీసేవ కేంద్రాలు కేటాయించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా, మొదటి విడతలో 78 జీపీల్లో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నాలుగు నెలల క్రితం అనుమతినిచ్చింది. అర్హులైన మహిళా సంఘాల సభ్యుల నుంచి మండలస్థాయి అధికారులు దరఖాస్తులు సైతం స్వీకరించారు. గత ఆగస్టు 15 నుంచి మీసేవ కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. దరఖాస్తు చేసుకున్న మహిళలు కూడా ఉపాధి దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. కొత్తవి అందుబాటులోకి వస్తే మీసేవ కేంద్రాల్లో దోపిడీ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఫిర్యాదులు వస్తున్నాయి
మీసేవ కేంద్రాల్లో దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్ర భుత్వం క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయినా కొందరు నిర్వాహకులు సేవలకు అధికంగా వసూలు చేస్తున్నార నే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల అధిక వ సూళ్లకు పాల్పడిన జైనూర్‌లోని మీసేవ కేంద్రం అనుమతిని కలెక్టర్ రద్దు చేశారు. నిబంధనలు పాటించని మీ సేవ కేంద్రాలపై చర్యలు తప్పవు.
– గౌతమ్‌రాజ్, ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్
అధిక వసూళ్లు..
ఆదాయం, కులం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం జిల్లావాసులకు తలకు మించిన భారంగా మారింది. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు ధ్రువపత్రాల కోసం ఇద్దరు గెజిటెడ్ అధికారులు, మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అటెస్టేషన్, రూ.20 బాండ్‌పై నోటరీ లాయర్ హామీ పత్రం తప్పనిసరి అంటూ అడ్డగోలు నిబంధనలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తీరా మీసేవ కేంద్రాల వద్దకు వెళ్తే అక్కడ నిర్వాహకులు అధిక వసూళ్లతో మరింత ఇబ్బంది పెడుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే రోజుల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. రూ.45 సర్వీసు చార్జీ ఉండే సర్టిఫికెట్లకు కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, తామే ఆమోదించేలా చూస్తామని చెబుతూ అమాయకులను నమ్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment