రాయితీ కోసం ఎదురుచూపులు
● జిల్లాలో పూర్తిస్థాయిలో అందని గ్యాస్ సబ్సిడీ ● కార్యాలయాల చుట్టూ మహిళల చక్కర్లు
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా అందించాల్సిన వంటగ్యాస్ రాయితీపై క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. రాయితీ ఎవరికి వస్తుందో.. ఎన్ని సిలిండర్లకు వస్తుందో.. అర్హతలను ఎలా నిర్ధారిస్తున్నారనే విషయం తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక వినియోగదారులు నిత్యం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు సైతం సరైన స్పష్టతలేకపోవడం గమనార్హం.
జిల్లాలో 1,39,562 కనెక్షన్‌లు
జిల్లా వ్యాప్తంగా భారత్, ఇండియన్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించిన 12 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1,39,562 కనెక్షన్‌లు ఉన్నాయి. వీటిలో సింగిల్ కనెక్షన్‌లు 1,11,898, డబుల్ కనెక్షన్‌లు 27,664 వరకు ఉన్నాయి. ఇందులో చాలా వరకు వినియోగదారులకు రాయితీ అందని ద్రాక్షగానే మారింది. రాయితీలో తమకు సంబంధం లేదనే ధోరణిలో ఆయిల్ కంపెనీలు సమాధానం ఇవ్వడం శోచనీయం.
ప్రజాపాలనలో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. బీపీఎల్ కుటుంబాలను గుర్తించి తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేశారు. ప్రతీ కుటుంబానికి నెలకు ఒక సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. అయినప్పటికీ అర్హులైన చాలామంది వినియోగదారులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాయితీ అందడం లేదు.
పరిష్కారం ఎప్పుడో..
మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తుల సవరణకు(ఎడిట్)గానూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సైతం పరిష్కారం చూపించడం లేదు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో వంటగ్యాస్ సిలిండర్ రాయితీ అందని వినియోగదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నంబర్, ఎల్‌పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నంబర్లను సవరించుకునే వెసులుబాటు కల్పించారు.
సరైన ధ్రువపత్రాలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ కోసం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులను సంప్రదించాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. ప్రభుత్వం రాయితీ డబ్బులను ఆన్‌లైన్‌లో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరుగుతోంది.
– వినోద్, డీఎస్‌వో
Comments
Please login to add a commentAdd a comment