బాధితులకు అండగా ఉంటాం
జైనూర్(ఆసిఫాబాద్): బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. లైంగిక దాడి యత్నంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న జైనూర్ మండలానికి చెందిన బాధిత మహిళను ఎమ్మెల్యేలు జాదవ్ అనిల్, కోవ లక్ష్మితో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. అంతకుముందు మండలంలోని దేవుగూడలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గ్రామంలోని సోయం వనిత అనే యువతికి కొన్నేళ్లుగా మాటపడిపోయిందని తెలుసుకుని బాధితురాలిని పరామర్శించారు. శస్త్ర చికిత్సకయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. జైనూర్ మండల కేంద్రంలోని కుమురంభీం, సోనుపటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి జామిని వరకు ర్యాలీగా వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ లటపటే మాధవ్‌ను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతికి హాజరుకావాలని మార్లవాయి ఉప సర్పంచ్ జుగ్నక సాయిత్రీ ఆహ్వానపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎంపీటీసీల మాజీ ఫోరం అధ్యక్షుడు కుమ్ర భగవంత్‌రావు, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మడావి భీంరావు, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, నాయకులు గేడం లక్ష్మణ్, మోహన్‌బాబు, మెస్రం రాహుల్, మెస్రం నాగోరావు, నాయకులు ముండే సతీష్, డోంగ్రే సమాధాన్ తదితరులు పాల్గొన్నారు.
● నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత
Comments
Please login to add a commentAdd a comment