‘ఆపరేషన్ స్మైల్’ సమర్థవంతంగా నిర్వహించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: బాల కార్మికుల గుర్తింపు కోసం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 11వ విడత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 14 ఏళ్లులోపు బాలబాలికలు ఎట్టి పరిస్థితుల్లో కార్మికులుగా ఉండకూడదన్నారు. ఇటుకల బట్టీలు, ఇతర పరిశ్రమలు, హోటళ్లు, వ్యవసాయంగం, ఇతర ఏ రంగంలోనైనా బాల కార్మికులను నియమించుకుంటే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇటుకలు, మట్టి పైపుల తయారీ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసేందుకు కుటుంబంతో వలస వస్తున్నందున చిన్నపిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలు, సమీప పాఠశాలలకు పంపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ పనులకు పంపించే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలాన్నారు. బడి మానేసిన, బడి వయస్సు గల పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ కేర్ నంబర్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమ అధి కారి రమాదేవి, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, బాలల సంరక్షణ అధికారి మహేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment