ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిర్యాణి మండలం గంభీరావుపేట, దొడ్ల, ఏదులపహాడ్ గ్రామ శివారులో తండ్రి పేరిట ఉన్న భూమిని సోదరుల పేరిట సమానంగా పట్టా చేయాలని గంభీరావుపేటకు చెందిన కడారి శివయ్య దరఖాస్తు చేసుకున్నాడు. తన భర్త పుట్టుకతో దివ్యాంగుడని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని నౌగాంబస్తీకి చెందిన జడల శారద అర్జీ సమర్పించింది. స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణం ఇప్పించాలని కౌటాల మండలం సదాశివపేటకు చెందిన హరిదాస్ విన్నవించాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చింతలమానెపల్లి మండలం కర్జవెల్లి గ్రామానికి చెందిన రౌతు జనాబాయి కోరింది. తన సోదరులు అక్రమంగా పట్టా భూమిని వారి పేరుతో మార్పు చేసుకున్నారని, న్యాయం చేయాలని కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన మీరారాణి మండల్ దరఖాస్తు చేసుకుంది. వితంతు పింఛన్ మంజూరు చేయాని జిల్లా కేంద్రానికి చెందిన సిర్ప సుందరీబాయి కోరింది. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment