చేనేతకు పునర్జీవం
● కార్మికుల సంక్షేమానికి మూడు పథకాలు
● నిధులు కేటాయించిన ప్రభుత్వం
చెన్నూర్: చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవం ఇచ్చింది. రోజు రోజుకు కనుమరుగవుతున్న చేనేతరంగం అభివృద్ధికి పెద్దపీట వేసింది. చేనేత పరిశ్రమతోపాటు కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేతన్న పొదుపు, నేత భద్రత కోసం నేతన్న బీమా, నేతన్న భరోసా పథకాల అమలుకు రూ.168కోట్లు కేటాయించింది. దీంతో చేనేత పరిశ్రమతోపాటు చేనేత కార్మికులకు మేలు జరగనుంది. చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. దీంతో వస్త్ర ఉత్పత్తి పెరిగి పరిశ్రమ అభివృద్ధి దిశగా పయనిస్తుందని పలువురు చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.
రెండు జిల్లాల్లో వంద కుటుంబాలు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ చేనేత సొసైటీలో 70 మంది కార్మికులు, కుమురంభీంఆసిఫాబాద్ జిల్లా కోసిని సొసైటీలో 30మంది కార్మికులు పని చేస్తున్నారు. ఒకప్పుడు వేల మంది కార్మికులతో కళకళలాడిన చేనేత సొసైటీల్లో నేడు కార్మికుల సంఖ్య వంద దిగువకు పడిపోయింది. కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చే కూర్చే విధంగా అమలుకు సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి నిధులు కేటాయించడంతో కార్మికులకు చేనేత పనిపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
నేతన్న పొదుపు పథకం..
చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు నేతన్న పొదుపు నిధి కింద ప్రభుత్వం రూ.115కోట్లు కేటాయించింది. కార్మికుడు తన వాటా కింద 8శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం 16శాతం వాటా మంజూరు చేస్తుంది. దీంతో ఈ పథకం ద్వారా కార్మికుడికి, అనుబంధ కార్మికులకు రూ.38 వేల లబ్ధి చేకూరుతుంది.
నేతన్న భద్రత(బీమా)
చేనేత కార్మికుడు ఏ కారణం చేతనైన మృతిచెందితే కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఈ పథకం 18 నుంచి 59సంవత్సరాలు ఉన్న కార్మికులకు ఎల్‌ఐసీ ద్వారా, 59 సంవత్సరాలు పైబడిన కార్మికులకు టీజీఎస్‌సీవో ద్వారా బీమా సొమ్ము చెల్లిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించింది.
నేతన్న భరోసా
ప్రభుత్వం తెలంగాణ మార్క్ లేబుల్‌ను ఉపయోగించి తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, కార్మికులకు వేతన మద్దతు అందించాలనే ఉద్దేశంతో నేతన భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒక్కో కార్మికుడికి పని ఆధారంగా రూ.18 వేల వరకు అనుబంధ కార్మికునికి రూ.6 వేలు చొప్పున మంజూరు చేస్తారు. నేతన్న భరోసాకు రూ.44 కోట్లు కేటాయించారు.
కార్మికులకు మేలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో కార్మికులకు మేలు జరుగుతుంది. చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు నేతన్న భరోసాతో చాలా లాభం చేకూరుతుంది. ప్రభుత్వం ప్రతీ కార్మికునికి బీమా వర్తింపజేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన కార్మికులు సైతం నేడు మగ్గాలను నమ్ముకుని బతుకుతున్నారు.
– ఇప్పలపల్లి కిష్టయ్య,
చెన్నూర్ చేనేత సొసైటీ అధ్యక్షుడు
ఉత్పత్తి పెరుగుతుంది
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనే చెన్నూర్ సొసైటీ పెద్దది. ఇక్కడ వస్త్ర ఉత్పత్తి సైతం బాగుంది. 70 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వం మూడు పథకాలకు నిధులు కేటాయించడంతో కార్మికులకు మంచి లాభం జరుగుతుంది. వస్త్ర ఉత్పత్తి పెరుగుతుంది. – బల్ల శశిధర్,
చేనేత సొసైటీ కార్యదర్శి, చెన్నూర్
Comments
Please login to add a commentAdd a comment