‘భరోసా’ సర్వేకు సర్వం సిద్ధం
● సాగుకు ఆమోదయోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ● నేటి నుంచి క్షేత్రస్థాయికి పరిశీలన బృందాలు ● గ్రామ సభల అనంతరం అర్హుల తుది జాబితా
ఆసిఫాబాద్: ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పథకం అమలుపై స్పష్టతనిచ్చింది. సాగుకు ఆమోదయోగ్యంగా ఉన్న భూమికి ఎకరాకు రూ. 12 వేలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించగా, అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేశారు. గు రువారం నుంచి అర్హుల గుర్తింపు కోసం సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 20 వరకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ఈ నెల 25న అర్హుల తుది జాబితా సిద్ధం చేయనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారుల ఖాతాల్లో నగదు జమ చే యనున్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు సైతం పథకం అమలు చేయనున్నారు. సీలింగ్ అంశాన్ని మాత్రం ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల్లో 1.38 లక్షల మంది రైతులు 4.42 లక్షల ఎకరాల భూమి సాగు చేస్తున్నట్లు గత రికార్డులు చెబుతున్నాయి. గతేడాది రైతుబంధు పథకం కింద జిల్లా రైతుల ఖాతాల్లో రూ.201 కోట్లు జమచేశారు. 2022 యాసంగిలో జిల్లాలో 1,14,448 మంది రైతులకు 1,13,477 మంది ఖాతాల్లో రూ.189.45 కోట్లు జమ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఈ పథకాన్ని ‘రైతు భరోసా’గా మార్చి ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే తాజాగా ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది.
మార్గదర్శకాలు..
రైతు భరోసా పథకం కింద సాగుకు ఆమోదయోగ్యంగా ఉన్న ప్రతీ ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, గుట్టలు, రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, సింగరేణి, సాగునీటి ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. రెవెన్యూ అధికారులు, గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించనున్నారు.
క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ
సాగుకు ఆమోదయోగ్యంగా లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ అధికారులు ఉంటారు. పంచాయతీ కార్యదర్శి, ఏవోలు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ బృందం లీడర్స్‌గా.. రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్‌ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో డీఏవోలు, ఎంపీడీవోలు, ఇతర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షిస్తాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యవసాయేతర భూములను గుర్తిస్తారు. సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తారు. ఆర్‌వోఆర్ పట్టాదారు పాస్‌పుస్తకాల జాబితా పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా పరిశీలిస్తారు. అన్నింటినీ బేరీజు వేసి వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల జాబితా సిద్ధం చేస్తారు. అధికారులు రూపొందించిన జాబితా గ్రామసభల్లో ప్రవేశపెడతారు. ఇందులో ఆయా భూముల వివరాలు ప్రదర్శిస్తారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు పరిశీలిస్తారు. మొత్తం వివరాల సేకరణ, పరిశీలన పూర్తయిన తర్వాత గ్రామ సభ ఆమోద ముద్ర వేస్తుంది. అనంతరం గ్రామాల వారీగా పంటల సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను సిద్ధం చేస్తారు.
నేటి నుంచి సర్వే
జిల్లాలో గురువారం నుంచి రైతు భరోసా సర్వే ప్రారంభిస్తున్నాం. అర్హుల గుర్తింపు ఈ నెల 25 వరకు పూర్తి చేసి 26వ తేదీ నుంచి పథకం ప్రారంభిస్తాం. సాగుకు ఆమోదయోగ్యమైన భూమికి పెట్టుబడి సాయం అందుతుంది. – రావూరి శ్రీనివాసరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment