● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
సర్వే ద్వారా లబ్ధిదారుల గుర్తింపు
ఆసిఫాబాద్: క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్‌లతో కలిసి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల వ్యవసాయాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రే షన్ కార్డుల అందజేత ప్రారంభిస్తుందన్నారు. ఈ నెల 16 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలు, ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజులు పనిదినాలు ఉన్న వారి వివరాలతో జాబితా రూపొందించాలన్నారు. రైతు భరోసా పథకంలో సాగుకు యోగ్యం కాని గుట్టలు, నివాసాలు, వెంచర్లు, భూ సేకరణ కింద తీసుకున్న సింగరేణి, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, రైల్వేలైన్ భూముల వివరాలు జాబితాలోకి తీసుకోకూడదని సూచించారు. రేషన్ కార్డుల కోసం పేర్ల తొలగింపులు, చేర్పులు, కొత్త కార్డుల జారీ జాబితాను రూపొందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు పాటించాల్సిన విధివిధానాలు వివరించారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. మాదారం టౌన్‌షిప్‌లో యోగా, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యూటీషియన్ కోర్సులు, గోలేటి టౌన్‌షిప్‌లో యోగా, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, డీటీపీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18 సాయంత్రం 5 గంటలలోగా జీఎం కార్యాలయం ఏటీబీ సెల్‌లో దరఖాస్తులు అందించాలని కోరారు. పూర్తి వివరాలకు సేవా సమితి కోఆర్డినేటర్ 99512 14116 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment