‘ఒప్పందాలు అమలు చేయడంలో విఫలం’
రెబ్బెన(ఆసిఫాబాద్): 2022 సెప్టెంబర్‌లో సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అక్బర్ అలీ ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనల్లో భాగంగా గురువారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, అప్పటివరకు జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న వారికి అలవెన్స్ చెల్లించాలన్నారు. మైన్స్ యాక్ట్ ప్రకారం ప్రతీ కాంట్రాక్టు కార్మికుడికి సిక్, పండుగ సెలవులు మంజూరు చేయాలన్నారు. నాగాల పేరిట కాంట్రాక్టు కార్మికుల నుంచి రికవరీ చేస్తున్న ఫైన్ విధానాన్ని రద్దు చేయాలని, ఓసీపీల్లో పనిచేస్తున్న డ్రైవర్లను వోల్వో ఆపరేటర్లుగా గుర్తించి హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు వృత్తిపన్ను రద్దు చేసి ఉచితంగా యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏరియా జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమాల్లో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, నాయకులు జగ్గయ్య, మారం శ్రీనివాస్, రాయిల్ల నర్సయ్య, అశోక్, సాగర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment