పక్షులను చూసొద్దామా..!
పెంచికల్‌పేట్(సిర్పూర్): జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్‌లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న మూడో విడత బర్డ్‌వాక్ కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్, సిర్పూర్(టి), పెంచికల్‌పేట్, బెజ్జూర్ రేంజ్‌ల పరిధిలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఔత్సాహిక పక్షి ప్రేమికులు బర్డ్ వాక్ ఫెస్టివల్‌కు హాజరు కానున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పెద్దవాగు, ప్రాణహిత నదులతోపాటు అనేక వాగులు, ప్రాజెక్టులు, చెరువులు, నీటి కుంటలను ఆవాసంగా ఏర్పాటు చేసుకుని పక్షులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణహిత, పెద్దవాగు సంగమ ప్రాంతంలో ఉన్న రాబందుల స్థావరం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గత రెండు విడతల్లో నిర్వహించిన బర్డ్‌వాక్ కార్యక్రమంలో సుమారు 350 రకాల పక్షి జాతులను ఇక్కడ గుర్తించారు. అమూన్ ఫాల్కన్, సహీన్ ఫాల్కన్, కామన్ కింగ్ ఫిషర్, బ్లాక్ ఈగల్, స్పాట్ బిల్డ్ డక్, బ్లూత్రోట్ వంటి అరుదైన జాతులు వెలుగులోకి వచ్చాయి.
బర్డ్ వాక్ ప్రాంతాలు..
పెంచికల్‌పేట్ పాలరాపు గుట్ట రాబందుల స్థావరం, బొక్కివాగు ప్రాజెక్టు, కొండెంగ లొద్ది, బేస్ క్యాంపు, రేగి చెట్టు మడుగు, బోల్ మెత్యం, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ప్రాణహిత నది, మత్తడి స్ప్రిగ్ ఆనకట్ట, గొల్లబాయి చెరువు, గబ్బాయి చెరువు, సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో సిర్పూర్ చెరువు, గొల్యాల్, మాలిని, అచ్చెలి చెరువు, భూపాలపట్నం, జీడివాగు, కాగజ్‌నగర్ రేంజ్ పరిధిలోని కోసిని చెరువు, వెంపల్లి, కడంబా వాచ్‌టవర్ ప్రాంతాలను సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా, అటవీశాఖ అధికారులు రూ.2500 ధర నిర్ణయించారు. పక్షి ప్రేమికులకు ఆయా రేంజ్‌లలో వసతితోపాటు రవాణా, భోజన సదుపాయం కల్పించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బర్డ్‌వాక్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆయా రేంజ్‌ల పరిధిలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఔత్సాహిక పక్షి ప్రేమికులు సందర్శించడానికి స్థలాల ఎంపిక పూర్తయింది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– సుశాంత్ సుఖ్‌దీర్, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన నంబర్లు
ఎఫ్‌డీవో కాగజ్‌నగర్ 93462 12281
ఎఫ్‌ఆర్‌వో పెంచికల్‌పేట్
90000 03429
ఎఫ్‌ఆర్‌వో బెజ్జూర్ 83286 19863
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ 95500 05343
కాగజ్‌నగర్ డివిజన్‌లో మూడు రోజుల పాటు బర్డ్‌వాక్
అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రాబందుల గుట్ట
Comments
Please login to add a commentAdd a comment