తడబడుతున్నారు..! | - | Sakshi
Sakshi News home page

తడబడుతున్నారు..!

Published Sun, Feb 2 2025 12:11 AM | Last Updated on Sun, Feb 2 2025 12:11 AM

తడబడుతున్నారు..!

తడబడుతున్నారు..!

● ‘సర్కారు’ విద్యార్థుల్లో మెరుగుపడని సామర్థ్యాలు ● ప్రాథమిక స్థాయిలో 16.5 శాతం మాత్రమే ఓకే ● 6 నుంచి 8తరగతుల్లో 50శాతం మించని వైనం ● 14 ఏళ్లలోపు వారిలో 73.8 శాతమే నయం ● ‘అసర్‌’ నివేదికలో ఉమ్మడి జిల్లా పరిస్థితి

అక్షరాలు.. చదవలేకపోతున్నారు

ఆదిలాబాద్‌టౌన్‌: చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా విద్యాపరంగా వెనుకబడే ఉంటుంది. అభ్యసన సామర్థ్యాల పెంపుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత, ఉన్న వారిలోనూ కొందరు తరచూ గైర్హాజరు కావ డం, సక్రమంగా బోధన చేయకపోవడం, అలాగే తల్లిదండ్రుల నిరక్షరాస్యత వంటి అనేక కారణాలు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతున్నాయి. సర్కారు బడుల్లో చదివేదంతా పేద విద్యార్థులే. అభ్యసన సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలున్నాయి.

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లాలో 3నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 16.5 శాతం మందే అక్షరాలు చదువగలుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల్లో 50శాతం మాత్రమే పాఠాలు చదువుతున్నారు. 47.6శాతం మంది మాత్రమే తీసివేతలు చేస్తున్నారు. కేవలం 37.3 శాతం మాత్రమే భాగాహారం చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో విద్యాసామర్థ్యాలపై రెండు నెలల క్రితం అసర్‌ సర్వే చేపట్టారు. ఈ నివేదికను ఇటీవల వెల్లడించగా అందులో అంశాలు విద్యాశాఖ పనితీరును తేటతెల్లం చేస్తోంది.

చదువులు అంతంతే...

సర్కారు బడుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అలాగే ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులను కూడా నిర్వహించింది. ఇదంతా బాగానే ఉన్న ఉ మ్మడి జిల్లాలో ప్రాథమిక విద్యావ్యవస్థ మాత్రం దయనీయంగా మారడం గమనార్హం. రెండేళ్లకోసా రి కేంద్ర ప్రభుత్వం యాన్యువల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ రిపోర్టు (అసర్‌) చేపడుతోంది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో ఆదిలాబా ద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని 15 గ్రామాల్లోని పాఠశాలల ను, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో కలిపి మరో 15 పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, డైట్‌ కళాశాలల్లో చదువుతున్న ఛాత్రోపాధ్యాయుల ద్వారా ప్రథమ్‌ ఎడ్యూకేషన్‌ సంస్థ ఈ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 262 పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించారు. జనవరి 28న ఢిల్లీలో నివేదికను వెల్లడించారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. అయితే విద్యార్థుల చదువులు వెనుకబాటుకు కొంతమంది ఉపాధ్యాయుల పనితీరే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సి న ఉపాధ్యాయుల్లో కొందరు చిట్టీలు నడపడం, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేపట్టడం, సమయానికి బడికి రాకపోవడం, వచ్చిన పనివేళలకు ముందే ఇంటి దారి పట్టడం, పాఠశాలకు వచ్చినా సక్రమంగా పాఠాలు చెప్పకపోవడం, వంతుల వారీగా విధులు నిర్వహించడం, సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేయ డం తదితర కారణాలతో సరైన బోధన జరగక విద్యార్థులు చదవడం, రాయడంలో వెనుకబడిపోతున్నట్లుగా తెలుస్తోంది.

మౌలిక వసతుల పరంగా..

ఉమ్మడి జిల్లాలో 16 శాతం పాఠశాలల్లో తా గునీటి వసతి లేదు. 31 శాతం పాఠశాలల్లో నీటి వసతి ఉన్నా అవి తాగడానికి ఉపయోగకరంగా లేవని అసర్‌ నివేదికలో వెల్లడైంది.

5.4 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 18.9 పాఠశాలల్లో ఉన్నప్పటికీ నీటి వసతి, ఇతర కారణాలతో వాటిని వినియోగించడం లేనట్లుగా తేలింది. అలాగే 9.2శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైంది.

ఇక 13.9 శాతం పాఠశాలల్లో లైబ్రరీలు లేవని, 29.9 శాతం పాఠశాలల్లో గ్రంథా లయాలు ఉన్నప్పటికీ వాటిలో పుస్తకాలు లేవని సర్వే నివేదిక స్పష్టం చేసింది.

98.1శాతం పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం ఉండగా ఇందులో 96 శాతం పాఠశాలల్లో వినియోగిస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

కంప్యూటర్‌ విద్యాపరంగా 91.1శాతం పాఠశాలల్లో అసలే కంప్యూటర్లే లేవని సర్వేలో వెల్లడైంది. 5.1 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా విద్యాబోధన సాగడం లేదని, కేవలం 3.8 శాతం పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్‌ బోధిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement