కూచిపూడి నాట్య పుస్తకాల ఆవిష్కరణ
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళా పీఠం కూచిపూడి, కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వేదాంతం రత్తయ్య శర్మ కళావేదికపై సాగుతున్న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల్లో రెండో రోజైన శనివారం రెండు కూచిపూడి నాట్య పుస్తకాలను ఆవిష్కరించారు. ఏలేశ్వరపు సర్వాణి రచించిన గురు శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి–ఏ బివేక్ ఆఫ్ కూచిపూడి విజ్‌డమ్ అనే నాట్య పుస్తకాన్ని అనువదిస్తూ వీణా మూర్తి విజయ్ రాసిన నాట్య తరంగణి నాట్య పుస్తకాలను విడుదల చేశారు. కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్, వేదాంతం వెంకట నాగ చలపతి రావు, వేదాంతం వెంకట రామ రాఘవయ్య, పసుమర్తి వెంకటేశ్వర శర్మ, చింతా రవి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడే స్తూపావిష్కరణ...
కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల కూచిపూడి పతాక స్తూపాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతిరావు తెలిపారు. అలనాటి నాట్యాచార్యులు నృత్య వాచస్పతి వేదాంతం పార్వతీశం ఆలోచనలతో కూచిపూడి పతాకం రూపుదిద్దుకుందన్నారు. చిత్రకారులు, ఆయన శిష్యుడు భాగవతుల రామకృష్ణ శర్మ కుంచె నుంచి జాలువారిన ఈ పతాకం స్వర్ణోత్సవాల సందర్భంగా ఆవిష్కరిస్తున్నారని తెలిపారు.
మునిసిపల్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలో జిల్లాలోని 37 మంది మునిసిపల్ ఉపాధ్యాయులకు శనివారం ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. గుడివాడ మునిసిపాలిటీలో గ్రేడ్–2 హెచ్‌ఎం –1, స్కూల్ అసిస్టెంట్లు–12, ప్రైమరీ స్కూల్ సైన్స్ ప్రధానోపాధ్యాయులు.. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లుగా నలుగురు, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలుగా ఇరువురు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, ఇరువురు ప్రైమరీ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ.. వారికి ఉప విద్యాశాఖాధికారి బీఎస్సీ శేఖర్‌సింగ్ ఉత్తర్వులు అందజేశారు.
వేదాంతం రాఘవయ్యకు
నృత్యవాచస్పతి అవార్డు
కూచిపూడి(మొవ్వ):అమెరికాలో ఉంటూ ఎంతో మంది ఔత్సాహికులైన యువతను కూచిపూడి కళాకారులుగా తీర్చుదిద్దుతున్న వేదాంతం వెంకట రామ రాఘవయ్య (రాఘవ)కు ప్రతిష్టాత్మక నృత్యవాచస్పతి అవార్డు వరించింది. కూచిపూడిలోని వేదాంతం రత్తయ్యశర్మ కళావేదికపై సాగుతున్న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో రెండో రోజు శనివారం అవార్డును ఆయనకు అందించారు. నాట్యాచార్యులు వేదాంతం పార్వతీశం స్మారకంగా వేదాంతం రత్తయ్య శర్మ పెద్ద కుమారుడైన వేదాంతం వెంకటరామరాఘవయ్య, నిర్వాహకుడు వేదాంతం వెంకట నాగచలపతిరావు, నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్, పసుమర్తి వెంకటేశ్వర శర్మ, చింతా రవి బాలకృష్ణ, వీణమూర్తి విజయ్, భాగవతుల సేతురామ్, వనజ ఉదయ్, వైజయంతి కాశీ, స్వర్ణలత, సీతా చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీరప్రాంతాలలో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద శనివారం కలెక్టర్ లక్ష్మీశ, , విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)తో కలిసి కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ కమిషనర్ టి. డోలా శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment