కచ్చితమైన గణాంకాలు కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై కచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పలు శాఖల అధికారులతో ఎస్సీల్లోని ఉపకులాల వారీగా జనాభా, వారి స్థితిగతులపై సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి 2011 జనాభా గణన ఆధారంగా ఎస్సీ ప్రజల గణాంకాలను ఏక సభ్య కమిషన్ చైర్మన్‌కు వివరించారు. 2011 ఉమ్మడి కృష్ణాజిల్లాలో 45.17 లక్షల మంది ఉండగా, ఎస్సీ జనాభాలో 51 ఉపకులాలు ఉన్నాయని, ప్రధానంగా మాదిగ జనాభా 4,44,734 మంది, మాలల జనాభా 3,89,665 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు.
ఎస్సీ ఉద్యోగుల వివరాలు సైతం..
అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనాన్ని చేయడానికి కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 13 జిల్లాల్లో ఎస్సీల్లోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు వారి శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలు, క్యాడర్, ఉప కులాల వారీగా కచ్చితమైన గణాంకాలతో సమాచారాన్ని తనకు పంపాలన్నారు. సమావేశంలో ఎస్సీ ఆర్. గంగాధరరావు, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహెద్‌బాబు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలెక్టర్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఎస్సీ ఉప కులాల వారీగా నివేదికలు ఇవ్వండి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
అభ్యంతరాలు, వినతుల స్వీకరణ
షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో వినతుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 337 వినతులను ఆయన తీసుకున్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో వినతులు ఇచ్చే వారి కోసం ప్రత్యేక కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్ల ఆధారంగా కమిషన్ చైర్మన్‌కు వారు వినతులు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment